ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం హామీ: టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కెర రాజు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో మంగళవారం రాష్ట్ర కమిటీ సభ్యులు ముఖ్యమంత్రితో భేటీ అయి రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సమస్యలతో పాటు స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి వారి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కెర రాజు తెలిపారు.
టీజేఎస్ రాష్ట్ర కమిటీ ప్రస్తావించిన సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ముక్కెర రాజు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ జన సమితి నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

