మల్లన్నకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలి.. డీజీపీకి డిమాండ్
భీమ్ ఇండియా టుడే న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా: బీసీ రాజ్యాధికార సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపడుతున్న బీసీ రాజ్యాధికార పాదయాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు రాజకీయ శక్తులు ఆయనపై దాడులకు కుట్రలు చేస్తున్నాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆరోపించారు. మల్లన్నకు ప్రాణహాని కలిగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.
నేటి పాదయాత్ర సందర్భంగా తీన్మార్ మల్లన్న ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనాన్ని లారీతో ఢీకొట్టేందుకు ప్రయత్నం జరిగిందనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని రవి పటేల్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాలని, ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో బెల్లి లలిత, మారోజు వీరన్న, సాంబశివుడు, ఎర్ర సత్యం వంటి ఉద్యమకారులు సామాజిక న్యాయం, తెలంగాణ హక్కుల కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలను ఆయన గుర్తుచేశారు. నేడు బీసీల రాజ్యాధికారం కోసం పోరాడుతున్న తీన్మార్ మల్లన్నకు కూడా ముప్పు పొంచి ఉందనే అనుమానాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
51 రోజులుగా వేల కిలోమీటర్లు నిర్విరామంగా పాదయాత్ర చేస్తూ బీసీల విద్య, వైద్యం, ఉద్యోగాలు, రాజకీయ వాటా, సామాజిక న్యాయం కోసం మల్లన్న పోరాటం సాగిస్తున్నారని తెలిపారు. ప్రజల ఉద్యమంగా మారిన ఈ పాదయాత్రను బెదిరింపులతో అడ్డుకోలేరని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని రవి పటేల్ పిలుపునిచ్చారు. భావితరాల భవిష్యత్తు, విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ అధికార సాధన కోసం సమిష్టిగా పోరాడాలని కోరారు. ఆధిపత్య రాజకీయాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టి సమాధానం చెప్పాలని అన్నారు.
తీన్మార్ మల్లన్నకు ఎలాంటి ప్రాణహాని కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, తెలంగాణ డీజీపీ వెంటనే స్పందించి ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని రవి పటేల్ డిమాండ్ చేశారు. మల్లన్నకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీసీ రాజ్యాధికార ఉద్యమాన్ని బెదిరింపులతో అణచివేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఈ ఘటనను తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండించాలని, రాష్ట్రంలో మరో భారీ బీసీ ఉద్యమానికి పరిస్థితులు దారితీయకముందే ప్రభుత్వం అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, అధికార ప్రతినిధి మడే సంతోష్, కోశాధికారి జినుకల శ్రీను, జిల్లా కోఆర్డినేటర్ మోటపోతుల సమ్మయ్య, జిల్లా నాయకులు జిలకల అశోక్, గట్టు శ్రీకాంత్, రోడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

