Friday, November 13, 2026
HomeEditorialవైద్యుల నియామకం పూర్తయ్యే వరకు బయటి వైద్యుల?

వైద్యుల నియామకం పూర్తయ్యే వరకు బయటి వైద్యుల?

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్  హైదరాబాద్ తెలంగాణ వచ్చే జూన్ 2వ తేదీ నాటికి అల్వాల్‌, ఎల్‌బీ నగర్‌ టిమ్స్‌లు, వరంగల్‌ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేసి సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పారు.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి మంత్రి దామోదర రాజనర్సింహ గారితో కలిసి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. టిమ్స్‌, వరంగల్‌ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా నూతన ఆసుపత్రుల నిర్మాణ పనులు, ఆయా ఆసుపత్రులకు అవసరమైన పరికరాల కొనుగోలు, వైద్యులు, సిబ్బంది నియామకాలు ఏకకాలంలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను 30 వేల నుంచి 38 వేలకు పెంచామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్కో కుటుంబానికి అందించే వైద్య చికిత్సల కవరేజీని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.

సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్‌బీ నగర్‌ టిమ్స్‌ల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలకు సంబంధించి ఏకీకృత విధానంలో చేపట్టాలని ఆదేశించారు. వైద్య సేవల అవసరాలకు అనుగుణంగా 3 టిమ్స్‌ల మధ్య వైద్యులు, సిబ్బంది బదిలీలు జరిగేలా ఉండాలన్నారు.

ఆసుపత్రుల నిర్వహణ, హౌస్ కీపింగ్ సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో చేపట్టాలని సూచించారు. టిమ్స్‌ల పర్యవేక్షణకు గ్రూప్-1 అధికారులను నియమిస్తామని తెలిపారు. నిర్వహణ, హౌస్ కీపింగ్ సిబ్బందిపై పర్యవేక్షణకు విశ్రాంత సైనికాధికారులను నియమిస్తామన్నారు. నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలకు వేరే సిబ్బంది ఉంటే, వైద్యులు పూర్తిగా వైద్య సేవలపైనే దృష్టి సారించే అవకాశం ఉంటుందని అన్నారు.

నిమ్స్‌లో శస్త్రచికిత్సలకు ఎక్కువ సమయం పడుతున్నందున సనత్‌నగర్‌ టిమ్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. నిమ్స్‌లో పడకలు లేకపోయినా, శస్త్రచికిత్సలకు ఆలస్యమైనా సనత్‌నగర్‌ టిమ్స్‌ను వినియోగించుకోవాలని చెప్పారు. ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నిమ్స్‌, టిమ్స్ డైరెక్టర్లు నిత్యం సమన్వయం చేసుకోవాలని సూచించారు.

టిమ్స్‌లో వైద్యుల నియామకం పూర్తయ్యే వరకు బయటి వైద్యులను నియమించుకోవాలని, అందుకు అవసరమయ్యే మొత్తాన్ని వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వైద్యులు, సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న మరో 79 డయాలసిస్ సెంటర్ల పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

టిమ్స్‌తో పాటు బోధన కళాశాలలు, నర్సింగ్ కళాశాలల పనులు, పరికరాల కొనుగోలు ప్రక్రియ ఏకకాలంలో పూర్తవ్వాలని, అందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఏఐ పర్యవేక్షణతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరు విషయంలో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్‌పేషెంట్ల (OP) సంఖ్య 7 కోట్ల నుంచి 9 కోట్లకు పెరగడం, ఇన్‌పేషెంట్ల (IP) సంఖ్య 23 లక్షల నుంచి 24.30 లక్షలకు పెరగడంపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి గతంలో సగటున 3.9 శాతం కేటాయించగా, గత మూడేళ్లుగా సగటున 4.8 శాతం నిధులు కేటాయిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

మూడేళ్లలో వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్ సిబ్బంది కలిపి 13,401 నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. మరో 5,640 నియామకాల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే క్రమంలో వైద్యారోగ్య శాఖకు అవసరమైన నిధులను ఎంత మొత్తమైనా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.