Tuesday, November 10, 2026
HomeEditorialనిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు నిర్వహిస్తున్నట్లు

నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు నిర్వహిస్తున్నట్లు

📰 Generate e-Paper Clip

హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్‌లో అనుమతులు లేకుండానే క్రాకర్స్ షాపుల నిర్వహణ?

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం!

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: దీపావళి పండుగను పురస్కరించుకుని హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో, చుట్టుపక్కల నివాస గృహాలు ఉన్న ప్రాంతంలో క్రాకర్స్ షాపులను ఏర్పాటు చేయడం స్థానిక ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా, సరైన అనుమతులు లేకుండానే కొన్ని దుకాణాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా హైస్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన క్రాకర్స్ షాపుల నంబర్లు 7, 8, లకు సంబంధించి అనుమతులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా దుకాణాల నిర్వాహకులను అనుమతుల పత్రాలు చూపించాలని అడిగితే, సమాధానం చెప్పాల్సింది పోయి దురుసుగా ప్రవర్తిస్తూ.. “ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వస్తున్నాయి. దీంతో అసలు ఈ దుకాణాలకు అనుమతులు ఉన్నాయా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అగ్నిప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?

ఇప్పటికే హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్ చుట్టుపక్కల నివాస గృహాలు ఉండటంతో పాటు, సమీపంలోనే ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంది. ఇలాంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో భారీ స్థాయిలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే దాని ప్రభావం సమీపంలోని ఇళ్లపై, ఆసుపత్రిపై, ప్రజలపై పడే ప్రమాదం లేకపోలేదు.

మరోవైపు కొన్ని దుకాణాల వద్ద కనీస అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు కూడా లేవనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో బాణసంచా దుకాణాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, భద్రతా ప్రమాణాలను పాటించకుండా దుకాణాలు నిర్వహించడం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమే అవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో జరిగిన ఘటన నుంచి అధికారులు గుణపాఠం నేర్చుకోలేదా?

గతంలో హుజురాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి కొన్ని దుకాణాలు ధ్వంసమైన ఘటనను పట్టణ ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఆ సమయంలో బాధిత వ్యాపారుల కష్టాలను చూసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన సొంత ఖర్చులతో ఆర్థిక సహాయం అందించి బాధితులకు అండగా నిలిచారు. అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కానీ ప్రస్తుతం హైస్కూల్ గ్రౌండ్‌లో అనుమతులపై అనుమానాలు వ్యక్తమవుతున్నా, భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల భద్రత కంటే వ్యాపారుల దందాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా? లేక అధికారుల పర్యవేక్షణ లోపించిందా? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

జిల్లా కలెక్టర్, పోలీస్, మున్సిపల్, అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించాలి!

హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన క్రాకర్స్ షాపుల నంబర్లు 7, 8,కు సంబంధించిన అనుమతుల పత్రాలను అధికారులు తక్షణమే పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. దుకాణాల నిర్వహణకు అవసరమైన లైసెన్సులు, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, ఇతర నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనే అంశాలపై సమగ్ర తనిఖీలు చేపట్టాలి.

నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజలకు ప్రమాదం కలిగించే విధంగా ఉన్న దుకాణాలను తక్షణమే తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అధికారులారా.. ప్రమాదం జరిగిన తర్వాత స్పందిస్తారా? లేక ప్రమాదం జరగకముందే మేల్కొంటారా? ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడం అధికారుల బాధ్యత కాదా? ఇది అధికారుల నిర్లక్ష్యమా? ప్రజల ప్రాణాలతో చెలగాటమా?

దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి కానీ, నిర్లక్ష్యం కారణంగా చీకట్లు నింపకూడదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మౌనం వీడి తక్షణ చర్యలు చేపట్టాలని హుజురాబాద్ పట్టణ ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.