రాత్రివేళల్లో తట్టుకోలేని వాసన.. కళ్లల్లో మంటలు, బయట ఉండలేని పరిస్థితి పచ్చని పొలాల మధ్య కాలుష్య కోరల్లో సూరారం.. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని గ్రామస్తుల డిమాండ్
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: సూరారం గ్రామ సమీపంలోని గ్యాస్ ప్లాంట్ ప్రాంతం నుంచి వస్తున్న తీవ్ర దుర్వాసనతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో దుర్వాసన మరింత ఎక్కువగా ఉండటంతో ఇళ్లలో కూడా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి నెలకొంటోందని వాపోతున్నారు.
గ్యాస్ దుర్వాసన కారణంగా కళ్లల్లో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. హెచ్₂ఎస్, అమోనియా, మీథేన్ వంటి వాయువుల వాసన వస్తోందని గ్రామస్తులు వ్యక్తం చేస్తూ, వాయు కాలుష్యంపై అధికారులు వెంటనే శాస్త్రీయంగా పరీక్షలు నిర్వహించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరుతున్నారు.
పచ్చని పొలాలు, వ్యవసాయ భూములతో నిండిన ప్రాంతంలో ప్రజల ఆరోగ్యాలకు ముప్పు కలిగించే విధంగా కాలుష్యం పెరుగుతుండటంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే తరాల పిల్లల ఆరోగ్యంపై దీని ప్రభావం ఏమిటన్నదే తమకు భయంగా ఉందని వారు అంటున్నారు.
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది సంబంధిత కాలుష్య నియంత్రణ అధికారులు, రెవెన్యూ, వైద్య శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్లకు అనుమతులు ఇచ్చే సమయంలో ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి సూరారం గ్రామంలో గాలి నాణ్యతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, దుర్వాసనకు కారణాలను గుర్తించి, ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

