Friday, August 28, 2026
HomeEditorialకేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల కీలక భేటీ*

కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల కీలక భేటీ*

📰 Generate e-Paper Clip

బీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్ర ప్రదేశ్:-కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల కీలక భేటీ

ఆక్వా, పొగాకు రంగాల సమస్యల పరిష్కారానికి కేంద్రానికి వినతులు

న్యూఢిల్లీ, జూలై 20:* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఆక్వాకల్చర్, పొగాకు రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను ఆయన నివాసంలో కలిసి అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (NFDB) ప్రాంతీయ కార్యాలయం, ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీ (AQF) ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో నెం.146 ద్వారా అమరావతి సమీపంలో 7.89 ఎకరాల భూమిని కేటాయించిందని, డీపీఆర్ తయారీ, పరిశీలనలు, ఆర్థిక అనుమతులు, నిధుల విడుదల, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి 2028 నాటికి నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో NFDB ప్రాంతీయ కార్యాలయం, ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీతో పాటు శిక్షణా కేంద్రం అందుబాటులోకి వచ్చి ఆక్వా రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అనంతరం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో కలిసి ఆక్వా, ఎఫ్‌సీవీ (FCV) పొగాకు రంగాల సమస్యలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని, ఈ రంగంపై లక్షలాది మంది రైతులు, కార్మికులు, హేచరీలు, ఫీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులు ఆధారపడి ఉన్నారని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు తగ్గడం, ముఖ్యంగా ఫీడ్ ధరలు పెరగడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, ఫిష్ మీల్ ఎగుమతులను నియంత్రించి దేశీయ అవసరాలకు ప్రాధాన్యత కల్పించాలని, అలాగే నమోదు చేసుకున్న రొయ్యల ఫీడ్ తయారీ సంస్థలకు మాత్రమే పరిమిత స్థాయిలో, తగిన నియంత్రణలతో 2021 నాటి విధానాన్ని అనుసరించి జన్యుమార్పిడి (GM) సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ చర్యల ద్వారా ఫీడ్ తయారీ వ్యయం తగ్గి రైతులకు ఉపశమనం కలగడంతో పాటు భారత రొయ్యల ఎగుమతుల పోటీతత్వం, విదేశీ మారకద్రవ్య ఆదాయం, లక్షలాది కుటుంబాల జీవనోపాధి రక్షించబడుతుందని తెలిపారు. అలాగే, పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. భారతదేశ ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఈ రంగంపై లక్షలాది మంది రైతులు, కూలీలు ఆధారపడి ఉన్నారని వివరించారు. HS Code 2401 కింద ఉన్న అన్‌మాన్యుఫ్యాక్చర్డ్ పొగాకుకు RoDTEP పథకాన్ని వర్తింపజేయడంతో పాటు Interest Equalisation Scheme (NIRYAT PROTSAHAN) పరిధిలోకి తీసుకురావాలని కోరారు. 2021-22లో భారత్ నుంచి ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతులు 105.21 మిలియన్ కిలోలు, రూ.2,909.99 కోట్ల విలువ ఉండగా, 2025-26 నాటికి 155.05 మిలియన్ కిలోలకు, రూ.7,782.98 కోట్ల విలువకు పెరిగాయని తెలిపారు. జింబాబ్వే, బ్రెజిల్ వంటి దేశాలు తమ ఎగుమతిదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్న నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్లో భారత పొగాకు ఎగుమతిదారులు పోటీ పడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా, పొగాకు రైతుల సంక్షేమం, ఆయా రంగాల స్థిరమైన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రుల బృందం స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులు ఈ అంశాలను ప్రాధాన్యతతో పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ సమావేశాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస రాజు, రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామ కృష్ణంరాజు, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి శ్రవణ్ కుమార్, కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీష్, భరత్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పురందేశ్వరి, బీద మస్తానీ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.