భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి హామీలు అమలు చేయకపోతే రణరంగమే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్ ఆగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్కతుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో మండల ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. “ప్రజలను నమ్మించి నట్టింట్లోనే గొంతు కోశారు.. ప్రజల గోసను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు” అని మండిపడ్డారు.
ముఖ్యంగా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే యూరియా కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేసిందని ఆరోపించారు. హామీ అమలు కోసం ఆటో డ్రైవర్లు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ప్రతి మహిళకు నెలకు రూ.2,500, పింఛన్ల పెంపు, కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం వంటి హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతులు, మహిళలు, ఆటో డ్రైవర్లు సహా అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. హామీల అమలులో ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, అవసరమైతే పోరాటాన్ని రణరంగంగా మారుస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.

