భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో చోటుచేసుకున్న కుట్రపూరిత సంఘటనల విషయంలో బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపించి, క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శాసనసభలో వెల్లడించారు.
శాసనసభ సమావేశాల తొలిరోజు స్పీకర్ గారిని ఉద్దేశించి దుర్భాషలాడిన ఉదంతం, దళితులు నడిచిన నేలను శుద్ధి చేసిన సంఘటనలపై యావత్ శాసనసభ ఆందోళన వ్యక్తం చేసింది. సభాపతి గారిని అవమానపరుస్తూ, జరిగిన దురదృష్టకర సంఘటన విషయంలో స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అసెంబ్లీ అండగా నిలిచింది. ఈ దురదృష్టకర సంఘటనల్లో మానసిక ధైర్యం కోల్పోవద్దని స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసింది.
ఈ అంశాలపై బుధవారం శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చపై సభా నాయకుడు, ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ విషయంలో స్పీకర్ గారికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు. సభాపతి గారి మనసును గాయపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ఉన్మాదానికి లోనై ఉసిగొల్పబడిన కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులు చేయడమే కాకుండా సభాపతి స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారు. శాసన సభాపతి తల్లి గారిని అవమానించారు” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
దేశంపై దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదులు, తీవ్రవాదులకు శాసనసభ ప్రాంగణంలో సభా అధ్యక్షుడిని అవమానిస్తూ మాట్లాడిన మాటలకు ఏమాత్రం తేడా లేదన్నారు. ఒక పథకం ప్రకారం దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగా ఈ సంఘటనను అభివర్ణించారు.
మన మాతృస్వామ్య సమాజం. స్త్రీని అపరకాళి, భద్రకాళి, భూమాత, భారతమాత, తెలంగాణ మాత అని పిలుస్తాం. ఏదైనా శక్తిని, గొప్పతనాన్ని ఆపాదించాలని, చర్చించాలని అనుకున్నప్పుడు తల్లితో పోలుస్తాం. మహిళతో పోలుస్తాం. మహిళను పూజించే మన సమాజం ఈ దేశాన్ని భారతమాత అని మహిళతో పోల్చుకుంటాం. రాష్ట్రాన్ని తెలంగాణ తల్లితో పోల్చుకుంటాం. అలాంటి ఈ తెలంగాణ నేల మీద ఒక తల్లిని అవమానించే విధంగా ప్రవర్తించడం దారుణం” అని ఆందోళన వ్యక్తం చేశారు.
సభాపతి గారికి జరిగిన అవమానం సమాజానికి జరిగినట్టే. దోషులను తెలంగాణ సమాజం ఉపేక్షించదు. రజాకార్లను దిగంతాలకు తరిమి మట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డది అని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ సభాపతి గారి మనసుకు గాయం చేయాలన్న ఆలోచన బరితెగించి మాట్లాడారని అన్నారు. సభాపతి గారిని అవమానించిన వారిని చట్టపరంగా శిక్షించే విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందని చెప్పారు.
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రభుత్వం భావించింది. విద్యారంగానికి సంబంధించిన సమస్యలు, ధరణిలో జరిగిన అక్రమాలు, 22 (ఎ) వంటి అంశాలే కాకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన చాలా అంశాలను చర్చించాలని భావించాం. ప్రజా సమస్యలపై చర్చ జరగకూడదని అడ్డుకున్నారుఅని ముఖ్యమంత్రి అన్నారు.

