Saturday, September 19, 2026
Homeతెలంగాణతెలుగు భాషపై మమకారం పెంచాలి

తెలుగు భాషపై మమకారం పెంచాలి

📰 Generate e-Paper Clip

 భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ చల్పూర్ జెడ్పీ హైస్కూల్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం – వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు

తెలుగు భాష గొప్పతనాన్ని, మాతృభాష ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు వారిలో భాషా నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించాలనే ఉద్దేశంతో హుజురాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు ఘనంగా నిర్వహించారు.

శనివారం హుజురాబాద్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చల్పూర్లో 8, 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు “దేశ భాషలందు తెలుగు లెస్స” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని తెలుగు భాషపై తమకున్న పరిజ్ఞానాన్ని, అభిప్రాయాలను, సృజనాత్మకతను వ్యాసాల రూపంలో వ్యక్తపరిచారు.

పోటీల అనంతరం విద్యార్థుల ప్రతిభను పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేశారు. వారికి శంకర్ నారాయణ డిక్షనరీలను బహుమతులుగా అందజేశారు. ట్రస్ట్ నిర్వాహకులు, సామాజిక కార్యకర్త డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇ. అనురాధ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు.

మాతృభాషతోనే భావ వ్యక్తీకరణకు బలం

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇ. అనురాధ మాట్లాడుతూ, ప్రముఖ భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. మన భావాలను సహజంగా, స్పష్టంగా వ్యక్తపరచడానికి మాతృభాష ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.తెలుగు భాషలో విద్యాబోధన చేయడం వల్ల విద్యార్థుల మైండ్ చురుకుగా పనిచేయడంతో పాటు గ్రహణ సామర్థ్యం పెరుగుతుందని ఆమె అన్నారు. తల్లి తన బిడ్డకు అందించే తల్లిపాల మాదిరిగానే మాతృభాష కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదని వివరించారు.

విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు భాషపై నైపుణ్యాన్ని పెంపొందించేందుకు గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు అందించడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పోటీతత్వంతో పాటు చదువుపై ఆసక్తిని, భాషపై మమకారాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు

వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఎల్. సాహితీ, ఎన్. అక్షర, బి. శ్రీక్షణ్య, జి. అశ్వంత్ సాయి, డి. సిలోమిలను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించింది. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా, భాషా పరిజ్ఞానం, సృజనాత్మక రచన, సామాజిక అవగాహన వంటి అంశాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మమత, గోదాదేవి, అంజనీదేవి, స్వర్ణలత, శ్రీదేవి, రాజేందర్, శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో మాతృభాషపై మరింత ఆసక్తిని, గౌరవాన్ని పెంపొందించేలా సాగింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.