ఈ వారంలో షెడ్యూల్ విడుదలకు అవకాశం.. దాదాపు 2.50 లక్షల డిగ్రీ సీట్లు ఖాళీ
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ ప్రవేశాలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్–తెలంగాణ (దోస్త్) ద్వారా స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పంపిన ప్రతిపాదనకు సీఎం ఆమోదం లభించినట్లు సమాచారం.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో దోస్త్ ద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందినట్లు తెలుస్తోంది. అయితే వివిధ కళాశాలల్లో ఇంకా దాదాపు 2.50 లక్షల సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ప్రభుత్వాన్ని కోరింది.
గతేడాది తరహాలోనే ఈసారి కూడా స్పాట్ ప్రవేశాల్లో స్థానికేతర విద్యార్థులకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం పరిశీలన జరిపిన అనంతరం స్పాట్ ప్రవేశాలకు అనుమతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దస్త్రంపై సంతకం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఇప్పటికే దోస్త్ కౌన్సెలింగ్లో సీటు పొందని విద్యార్థులతో పాటు, ఇప్పటివరకు డిగ్రీలో ప్రవేశం పొందలేకపోయిన విద్యార్థులకు కూడా అవకాశం లభించనుంది. ముఖ్యంగా ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడం ద్వారా కళాశాలల్లో విద్యా కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
స్పాట్ ప్రవేశాలకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ఫీజు తదితర వివరాలతో కూడిన షెడ్యూల్ను ఈ వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ విడుదలైన తర్వాత విద్యార్థులు సంబంధిత వివరాలను పరిశీలించి, తమకు అనుకూలమైన కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దోస్త్ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియపై అధికారిక షెడ్యూల్ విడుదల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

