భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) నూతన ప్రాంగణానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాంగణం కోసం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాల భూమి కేటాయించింది.
2009లో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్ (JNNURM) కింద ఎంపికైనప్పటికీ ఎన్ఐయూఎంకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించని కారణంగా ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాలు కేటాయించింది.
తెలంగాణలో పట్టణ విధానాల రూపకల్పనకు, కార్యాచరణ ఆధారిత పరిశోధన సంస్థగా ఎన్ఐయూఎం కీలకంగా పనిచేస్తుంది. 2028 జూన్ 2 నాటికి ప్రాంగణ నిర్మాణాన్ని పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అంతకుముందు ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) భవనాల నిర్మాణాలు, పరిసర ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

