గణేష్ చౌక్‌లో అగ్నిప్రమాద బాధితులకు న్యాయం చేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదు – టిఆర్పి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హెచ్చరిక
ప్రభుత్వం దగ్గర ప్రజల కష్టాలు తీర్చడానికి నిధులు లేవా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక ఎందుకు గుర్తుకు రావడం లేదు
భీమ్ ఇండియా టుడే న్యూస్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి కేంద్రంలోని గణేష్ చౌక్ రోడ్డుపై ఉన్న ఫుట్‌పాత్ దుకాణాలు ఇటీవల ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురై ఐదు షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం తీవ్ర విచారకరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు.
ఈరోజు ప్రమాద స్థలాన్ని సందర్శించిన రవి పటేల్ బాధిత దుకాణ యజమానులను కలిసి జరిగిన నష్టాన్ని, వారి కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సుమారు రూ.12 లక్షల విలువైన సరుకులు, సామాగ్రి అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఆయనకు వివరించారు.
అనంతరం అక్కడి నుంచే భూపాలపల్లి తహసీల్దార్ (ఎమ్మార్వో)తో ఫోన్లో మాట్లాడి, జాతీయ విపత్తు సహాయ నిబంధనల ప్రకారం అర్హులైన బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అయితే విపత్తు నిధులు అందుబాటులో లేనందున ప్రస్తుతం సహాయం అందించలేని పరిస్థితి ఉందని ఎమ్మార్వో తెలిపినట్లు రవి పటేల్ పేర్కొన్నారు.
ప్రజలు ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ప్రభుత్వానికి నిధులు లేకపోవడం సిగ్గుచేటు. ప్రజల సంక్షేమం కంటే అనవసర ఖర్చులకే ప్రాధాన్యత ఇస్తున్నారా? పేద వ్యాపారుల జీవితాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని రవి పటేల్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
జిల్లా కలెక్టర్ వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించి ఐదుగురు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే ఒక్కో దుకాణానికి రూ.లక్ష చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందించాలని రవి పటేల్ డిమాండ్ చేశారు.
దుకాణాల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
గతంలో రోడ్డు విస్తరణ కారణంగా ఈ వ్యాపారులు తమ దుకాణాలను కోల్పోయారని, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వారికి ప్రత్యామ్నాయ స్థలం, దుకాణాల నిర్మాణానికి సహాయం చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని రవి పటేల్ గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఈ సమస్యకు పరిష్కారం చూపకపోవడం బాధాకరమన్నారు.
అటవీ శాఖ పరిధిలో ఉన్న స్థలానికి సంబంధించిన సమస్యను జిల్లా కలెక్టర్, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పరిష్కరించి, చట్టపరమైన నిబంధనలు మరియు కోర్టు పరిధిలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దుకాణాలు నిర్మించుకునేందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించి, షెడ్లు ఏర్పాటు చేసుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
బాధితుల విజ్ఞప్తి మేరకు భూపాలపల్లి డీఎఫ్‌ఓకు ఫోన్ చేసి, స్థలానికి సంబంధించిన సమస్యలు, కోర్టు వ్యవహారాల్లో దుకాణ యజమానులకు చట్టపరమైన పరిష్కారం లభించేలా సహకరించాలని రవి పటేల్ కోరారు.
పేద వ్యాపారుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకునేది లేదు. బాధితులకు న్యాయం జరిగే వరకు, వారికి రావాల్సిన స్థల సమస్య పరిష్కారమై దుకాణాలు నిర్మించుకునే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. అధికారులు స్పందించకపోతే బాధితులతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని రవి పటేల్ హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో ప్రజల ఓట్ల కోసం హామీలు ఇచ్చే రాజకీయ నాయకులు, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేదలు ఎక్కడ ఆపదలో ఉన్నా వారికి అండగా నిలబడటమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు.
గణేష్ చౌక్ దుకాణాల బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు ఇకనైనా బాధ్యతగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని రవి పటేల్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిఆర్పి పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, అధికార ప్రతినిధి మడే సంతోష్, జినుకల శ్రీను, అశోక్, చంద్రశేఖర్, లక్ష్మణ్, ప్రసాద్, రామ్ చరణ్, బాధిత దుకాణ యజమానులు, స్థానికులు పాల్గొన్నారు.

