గ్రామ పారిశుద్ధ్య కార్మికురాలు సుశీలకు కన్నీటి వీడ్కోలు.. కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి హన్మకొండ జిల్లా గ్రామ పారిశుద్ధ్య సేవల్లో విశేష సేవలందించిన సుశీల మృతి పట్ల గ్రామస్తుల సంతాపం
గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ, ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించిన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు తూముల సుశీల మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది. దశాబ్దాలుగా గ్రామానికి సేవలందించిన కుటుంబానికి చెందిన సుశీల భౌతికంగా దూరం కావడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి అశ్రునయనాలతో తుది నివాళులు అర్పించారు.
తూముల పోశయ్యతో ప్రారంభమైన గ్రామ సేవా ప్రస్థానం ఆయన కుమారుడు వీరయ్య, ఆయన భార్య తూముల సుశీల ద్వారా కొనసాగింది. దాదాపు వందేళ్లుగా ఈ కుటుంబం గ్రామానికి పారిశుద్ధ్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందింది. గ్రామ వీధులను పరిశుభ్రంగా ఉంచడంలో, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వారు అందించిన సేవలను గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు.
కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
సుశీల మృతి విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కేతిరి లక్ష్మారెడ్డి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ తరఫున ఆమె కుటుంబ సభ్యులకు రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందజేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామానికి ఆమె అందించిన సేవలు మరువలేనివని, పారిశుద్ధ్య కార్మికుల సేవలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుర్ర సమ్మయ్య, వార్డు సభ్యులు వడ్డేపల్లి మమత, తాళ్లపెళ్లి అనిత, తూముల ఎల్లయ్య, తాళ్లపల్లి చిన్న రాజయ్య, సందిళ్ల శ్వేత, పారందుల క్రాంతి కుమార్, బండి లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి ఆర్. భాస్కర్, కారోబార్ ఉప్పుల భూమయ్య, పంచాయతీ సిబ్బంది నవీన్, రవీందర్, వసంత, ఫీల్డ్ అసిస్టెంట్ చిదురాల కుమారస్వామి, మాజీ సర్పంచ్ వనపర్తి రాజయ్య, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని సుశీలకు తుది నివాళులర్పించారు.
గ్రామ పరిశుభ్రత కోసం ఆమె చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమని గ్రామస్తులు పేర్కొంటూ, సుశీల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

