Thursday, September 17, 2026
Homeతెలంగాణతిరుమల కుంట వద్ద కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు

తిరుమల కుంట వద్ద కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు

📰 Generate e-Paper Clip

భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ తిరుమల కుంట వద్ద కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలోని తిరుమల కుంట వద్ద కల్వర్టు నిర్మించాలని గ్రామ రైతులు చాలాకాలంగా కోరుతున్న నేపథ్యంలో, కల్వర్టు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.

వర్షాకాలంలో తిరుమల కుంట మత్తడి పడిన సమయంలో కుంటకు అవతలి వైపు ఉన్న వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ సర్పంచ్ కేతిరి లక్ష్మారెడ్డి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి ఇరిగేషన్ శాఖ అధికారులకు తక్షణమే స్థలాన్ని పరిశీలించి, కల్వర్టు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.

మంత్రి ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు తిరుమల కుంట వద్దకు చేరుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. కుంట మత్తడి పడే సమయంలో రైతులు ఎదుర్కొంటున్న రాకపోకల సమస్య, కల్వర్టు నిర్మాణానికి అనువైన ప్రదేశం తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ.. కల్వర్టు నిర్మాణానికి అవసరమైన వివరాలను సేకరించి, అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదం కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామని రైతులకు తెలిపారు. కల్వర్టు నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో రైతులకు ఎదురవుతున్న రాకపోకల ఇబ్బందులు తొలగడంతో పాటు వ్యవసాయ పనులకు సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విరిత డీఈఈ కృష్ణకాంత్, ఏఈఈ శశిధర్ రెడ్డి, ఏఈఈ, గ్రామ సర్పంచ్ కేతిరి లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్ బుర్ర సమ్మయ్య, వార్డు సభ్యులు తాళ్లపల్లి రాజయ్య, పారందుల క్రాంతి కుమార్తో పాటు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.