Thursday, September 17, 2026
Homeతెలంగాణరేపల్లె గ్రామాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంటనే సందర్శించాలి

రేపల్లె గ్రామాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంటనే సందర్శించాలి

📰 Generate e-Paper Clip

బాధిత కుటుంబానికి రక్షణ, ఆర్థిక సహాయం అందించాలి బిఎస్పీ

భీమ్ ఇండియా టుడే న్యూస్ జోగులాంబ గద్వాల్ జిల్లా, గద్వాల్ మండలం, రేపల్లె గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) నాయకులు స్పందించారు. బిఎస్పీ జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు మణికుమార్ గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్, పార్లమెంట్ ఇంచార్జ్ మాసన్నతో పాటు జిల్లా నాయకులు రేపల్లె గ్రామాన్ని సందర్శించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ రేపల్లె గ్రామంలో చోటుచేసుకున్న ఘటనను ఖండించారు. ఇద్దరు మేజర్లు పరస్పర ఇష్టంతో వివాహం చేసుకున్న నేపథ్యంలో ఏర్పడిన సమస్యను హైదరాబాద్ పోలీసులు పరిష్కరించినప్పటికీ, అనంతరం అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి కుటుంబానికి చెందిన ఇంటిని కూల్చివేయడం బాధాకరమని అన్నారు.

అత్యాధునిక సమాజంలో కూడా కులం, లింగం, వర్ణం, మతం ఆధారంగా వివక్షకు చోటు ఉండకూడదని పృథ్వీరాజ్ అన్నారు. బాధిత కుటుంబానికి చెందిన ఇంటిని కూల్చివేసిన ఘటనపై బాధ్యులను గుర్తించి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు వెంటనే స్పందించి రేపల్లె గ్రామాన్ని సందర్శించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్షను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతి నెల 30వ తేదీన గ్రామాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని బిఎస్పీ నాయకులు కోరారు. ప్రతి నెల సివిల్ రైట్స్ డే నిర్వహించడం ద్వారా ప్రజలకు రాజ్యాంగ హక్కులు, పౌర హక్కులపై అవగాహన పెరిగి, కుల వివక్షను తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఇంటిని పునర్నిర్మించి ఇవ్వడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని, వారి ధన, మాన, ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పించాలని బిఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిఎస్పీ జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు మణికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ అబ్రహం మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు రాంబాబు, జిల్లా నాయకులు శాంతిరాజ్, దేవన్న, నరేష్, గోవింద్, దుబ్బన్న, బొల్లి కురుమయ్య, దాసరి అశోక్, గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.