హుజురాబాద్‌లో అఖిలపక్ష ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్, సెప్టెంబర్ 15: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, ఆయనను కించపరిచేలా పుస్తకాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్న హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయాలని హుజురాబాద్ అఖిలపక్ష ప్రజాసంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం హుజురాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద అఖిలపక్ష ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ను అవమానపరిచే వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఆయనపై రాసినట్లు పేర్కొంటున్న ‘కల్పిత గాంధీ’ పుస్తక ఆవిష్కరణను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని, భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ప్రజలందరికీ ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు, రాజ్యాంగ విలువలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని తెలిపారు. అలాంటి మహనీయుడిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా వ్యవహరించడం అంటే దేశ ప్రజల రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్య విలువలను అవమానపరచడమేనని నాయకులు పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని, చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
హమారా ప్రసాద్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు పుస్తక ఆవిష్కరణను నిలిపివేయాలని నాయకులు హెచ్చరించారు. లేనిపక్షంలో హుజురాబాద్‌లో ప్రారంభమైన నిరసన కార్యక్రమాలను హైదరాబాద్ వరకు కొనసాగించాల్సి వస్తుందని తెలిపారు. ఈ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన బడుగు బలహీన వర్గాల ప్రజాప్రతినిధులపై ఉందని అన్నారు.
అంబేద్కర్‌ను అవమానించే ఎలాంటి చర్యలను సహించబోమని అఖిలపక్ష ప్రజాసంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసనకు ప్రభుత్వం స్పందించి, సంబంధిత వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రామచందర్, బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్, సందెల వెంకన్న, తాళ్లపల్లి రమేష్, ఇప్పకాయల సాగర్, కొలిపాక క్రాంతికుమార్, కన్నెబోయిన జంపయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల ఓదెలు, కౌన్సిలర్ బోరగాల మొగిలి, ఇల్లందుల సమ్మయ్య, స్వేరో నాయకులు ఆకినపల్లి ప్రవీణ్ కుమార్, గడప రాజు, మిడిదొడ్డి రాజు, తునికి వసంత్, శనిగరం రవి, పిట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

