భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన గాయత్రి–త్రిసా జోడీకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్: ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం (Bronze Medal) సాధించిన భారత బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీలను తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు.
ప్రపంచ స్థాయి పోటీల్లో భారతదేశానికి, తెలంగాణకు గర్వకారణంగా నిలిచేలా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీలు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారితో ప్రత్యేకంగా మాట్లాడి, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్య పతకానికి అభినందనలు తెలిపారు.
చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను ప్రదర్శిస్తూ వరుస విజయాలు సాధిస్తున్న గాయత్రి–త్రిసా జోడీని సీఎం ప్రశంసించారు. కఠినమైన అంతర్జాతీయ పోటీల్లో పట్టుదల, క్రమశిక్షణతో ఆడి పతకం సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లలో విజయం సాధించి దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందించేందుకు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యువ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడా రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మార్గదర్శకత్వంలో గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీలు సాధిస్తున్న విజయాలు భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తుపై మరింత ఆశలు కలిగిస్తున్నాయని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీవీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వేదికపై భారత బ్యాడ్మింటన్ జెండాను ఎగురవేసిన గాయత్రి–త్రిసా జోడీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

