దేవరకొండలో మానవత్వం చాటుకున్న ‘అజ్ఞాతవాసి’.10 పేద పద్మశాలి కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ
భీమ్ ఇండియా టుడే న్యూస్ నల్గొండ జిల్లా (దేవరకొండ), నవంబర్ 6:సాటి మనిషికి సాయం చేయడంలోనే నిజమైన మానవత్వం ఉందని చాటుతూ దేవరకొండకు చెందిన ఓ గుప్తదాత ‘అజ్ఞాతవాసి’ నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. తన పేరు, వివరాలను గోప్యంగా ఉంచుతూ గత ఎనిమిది నెలలుగా నిరుపేద పద్మశాలి కుటుంబాలకు నిరంతరంగా సహాయం అందిస్తూ మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు.
దేవరకొండ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్ సేవాసదనంలో అజ్ఞాతవాసి తరఫున పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన 10 నిరుపేద కుటుంబాలకు ఎనిమిదో నెల నిత్యావసర సరుకులు, బియ్యాన్ని పంపిణీ చేశారు. పద్మశాలి నేత అజ్ఞాతవాసి కార్యవర్గ సభ్యుడు ముషిని వీరయ్య లబ్ధిదారులకు సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి, దాత ప్రతినిధి ముషిని వీరయ్య మాట్లాడుతూ.. దాత అజ్ఞాతవాసి తన పేరును ప్రచారం చేసుకోకుండా గత ఎనిమిది నెలలుగా నిరుపేద కుటుంబాలకు సుమారు లక్ష రూపాయల విలువైన ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని కొనియాడారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తినిస్తాయని అన్నారు.
నిస్వార్థంగా సేవ చేస్తున్న అజ్ఞాతవాసికి భగవంతుడు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. తమ కుటుంబాలకు నిరంతరం అండగా నిలుస్తున్న గుప్తదాతకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ సంఘం కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

