Friday, October 23, 2026
Homeతెలంగాణపోరాడిన గొప్ప ప్రజా వీరుడు పండుగ సాయన్న

పోరాడిన గొప్ప ప్రజా వీరుడు పండుగ సాయన్న

📰 Generate e-Paper Clip

నిరంకుశ పాలనపై పోరాడిన బహుజన వీరుడు పండుగ సాయన్న! పేదల ఆకలి తీర్చిన ప్రజా నాయకుడు.. అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: నిరంకుశ పాలన, భూస్వామ్య వ్యవస్థ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప ప్రజా వీరుడు పండుగ సాయన్న అని సొసైటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముప్పు శీను, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు మాచర్ల శంకర్ అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి ముప్పు శ్రీను ఆధ్వర్యంలో గురువారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో పండుగ సాయన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పండుగ సాయన్న చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. పండుగ సాయన్నను ప్రజలు తెలంగాణ రాబిన్‌హుడ్‌గా గుర్తించారని తెలిపారు. ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు అండగా నిలిచి, వారి ఆకలి తీర్చిన బహుజన వీరుడని కొనియాడారు. ధనవంతులు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా నిలిచి, అణగారిన వర్గాల హక్కుల కోసం తిరుగుబాటు చేసిన ధైర్యశాలి అని పేర్కొన్నారు.

ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు మాచర్ల శంకర్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పండుగ సాయన్న అలుపెరగని పోరాటం సాగించారని తెలిపారు. పేదల ఆకలి తీర్చేందుకు ధాన్యాగారాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి నిరుపేదలకు పంచిపెట్టేవారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించిన పండుగ సాయన్న, సామాజిక అసమానతలు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఆయన ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

అనంతరం అంబేద్కర్ సంఘం నాయకుడు గుర్రం శీనుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్ గొడిశాల రాజన్న గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ రమేష్, శనిగరపు వెంకటేష్, అంబాల స్వామి, పాక రమేష్, బాబుపేట సర్పంచ్ బత్తిని రవీందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, మాజీ మండల అధ్యక్షుడు హింగే శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ నాయకులు, ముదిరాజ్ కుల పెద్దలు బొజ్జ గోపాల్, మాచర్ల శ్రీనివాస్, రవి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.