తెలంగాణకు వాన హెచ్చరిక..
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా 11 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ జిల్లాలకు హెచ్చరిక
ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పొలాల్లో పనిచేసే రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప వర్షం, ఉరుములు, మెరుపుల సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో నిలబడవద్దని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు పాటించాలని TGiCCC అధికారులు కోరారు.

