Monday, October 19, 2026
HomeEditorialరాజ్యాంగ హక్కుల పరిరక్షణకు మార్గదర్శకాలు

రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు మార్గదర్శకాలు

📰 Generate e-Paper Clip

అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు మార్గదర్శకాలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ న్యూఢిల్లీ: అరెస్టు చేసే సమయంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను పోలీసులు తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అరెస్టుకు గల కారణాలను నిందితుడికి తెలియజేయకపోవడం, అలాగే అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 నిబంధనలకు విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. 

జస్కరన్ జీత్ సింగ్ డియోల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్’ కేసులో జస్టిస్ ఉజ్జల్ భూయన్, జస్టిస్ ఏఎస్ చందూర్‌కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మార్గదర్శకాలను వెల్లడించింది. అరెస్టు కారణాలను రాతపూర్వకంగా అందించకుండా చేసిన అరెస్టును చట్టవిరుద్ధంగా పరిగణించవచ్చని కోర్టు పేర్కొంది. 

మళ్లీ అరెస్టు చేయాలంటే మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి

రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి ఒక వ్యక్తిని అరెస్టు చేసి, ఆ అరెస్టును చట్టవిరుద్ధంగా ప్రకటించి విడుదల చేసిన తర్వాత, పోలీసులు తమంతట తాము మళ్లీ అరెస్టు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తిరిగి అరెస్టు చేయాల్సిన అవసరం ఉంటే ముందుగా స్థానిక మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించి అనుమతి పొందాలని ఆదేశించింది. 

మెజిస్ట్రేట్ అనుమతి కోరే సమయంలో మొదటి అరెస్టులో కారణాలను ఎందుకు రాతపూర్వకంగా ఇవ్వలేకపోయారో పోలీసులు వివరించాల్సి ఉంటుందని, అలాగే తదుపరి కస్టడీ ఎందుకు అవసరమో చూపించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. 

నిబంధనలు ఉల్లంఘించే పోలీసులపై శాఖాపరమైన చర్యలు

అరెస్టు సమయంలో రాతపూర్వకంగా కారణాలు అందించని పోలీసు అధికారిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణలో తప్పిదం నిర్ధారణ అయితే సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఆ అంశాన్ని సర్వీస్ రికార్డులో నమోదు చేయాలని సూచించింది. ఈ తీర్పు ప్రతులను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలకు పంపాలని కూడా కోర్టు ఆదేశించింది. 

ఆర్టికల్ 22(1), 22(2)లోని రక్షణలు కేవలం సాంకేతిక ప్రక్రియలు కాదని, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక రాజ్యాంగ పరిరక్షణలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.