Friday, August 28, 2026
HomeEditorialఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ విద్యార్థులకు శుభవార్త. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ఇకనుంచి ప్రతి ఏటా అడ్వాన్స్‌గా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులను ముందుగానే వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.

 నెక్లెస్‌ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి  ఆవిష్కరించి ఆ మహనీయులకు నివాళులర్పించారు.

 ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అజరుద్దీన్, సలహాదారులు కే కేశవ రావు వీ హనుమంత రావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

 ఈ సందర్భంగా హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ఫీజులు కట్టలేదని, యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఆపడానికి వీలులేదు. విద్యార్థులు అడక్కుండానే వారి ఖాతాలో డబ్బులు వేస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి ముందస్తుగా బ్యాంకు ఖాతాల్లో సిద్ధంగా పెడుతున్నాం. ఈ విధానాన్ని ప్రక్షాళన చేసి, ప్రతి ఏటా రూ. 2,400 కోట్లు విద్యార్థుల ఖాతాల్లో వేసి ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని తెలిపారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. “ఒకప్పుడు ఇంజనీరింగ్, డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్కిల్స్‌ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. అందుకే నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్య, ఆ తర్వాత స్కిల్స్ నేర్పాలి. సాంకేతిక నైపుణ్యం ఉన్న వారికి ఈ సమాజం రెడ్ కార్పెట్ పరుస్తుంది. కేవలం సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వస్తుందో రాదో.. చెప్పలేం” అని పేర్కొన్నారు. ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యం కోసం సంపూర్ణమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నది. ఏటీసీలు, పాలిటెక్నిక్, స్కిల్స్ యూనివర్సిటీ.. ఇతర సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోండి. ఆడపిల్లలు నర్సింగ్ చదువుకుంటే రూ. 2 లక్షలతో జపాన్ , జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి.

ఇప్పుడు చదువుల్లో పోటీ పెరిగింది. చాలా మందికి 90 శాతం పైగా మార్కులు వస్తున్నాయి. చదువు మాత్రమే కాదు. సాంకేతిక నైపుణ్యంలో రాణించే వారూ ఉంటారు. కొందరు క్రీడల్లో రాణించే వారుంటారు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయి“ అని పేర్కొన్నారు.

 యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కోటి రూపాయల నగదు బహుమతిని అందిస్తామని ముఖ్యమంత్రి గారు బాక్సింగ్ చాంపియన్ కు నిఖత్ జరీన్, సిరాజ్, దీప్తీ దివాంజీలను ఉదహరించారు.

“మీరూ క్రీడల్లో రాణించండి. రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించండి. దేశ స్థాయిలో గౌరవాన్ని తీసుకురాండి. ఒలింపిక్స్‌లో మెడల్స్‌ సాధించండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి.. నగదు నజరానాలు ఇచ్చే బాధ్యత నాది.

కేవలం చదువుకుంటేనే బతుకులు మారుతాయి. చదువుకుంటేనే మన తలరాతలు మారుతాయి. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవకాశాల కోసం పోటీ పడాలి.

 ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ చదువుకుంటే అమెరికాలో ఉద్యోగం వచ్చేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సాంకేతిక విప్లవం వచ్చింది. ఏఐ వల్ల ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, ఐటీ నిపుణుల ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం తలెత్తింది. ఏ విధంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలో మనం ఆలోచన చేయాల్సిన అవసరముంది. 

 కులాల మధ్య అంతరాలను తగ్గించడానికి అన్ని వర్గాలు ఒకే చోట కలిసిమెలిసి జీవించడమనే లక్ష్యంతో రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధానం ద్వారా విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్నాం” అని చెప్పారు.

జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే లాంటి మహనీయుల జీవిత విశేషాలను వివరిస్తూ విగ్రహాలు చేయడం ఏర్పాటు కేవలం జయంతి, వర్ధంతులను నిర్వహించడానికి కాదని, గొప్ప వ్యక్తులు చేసిన త్యాగాలు, వారి గొప్పతనాన్ని విగ్రహాల ద్వారా స్ఫూర్తి పొందడానికి వేదికలుగా నిలుస్తాయని అన్నారు. 

 మహనీయుల స్ఫూర్తితో విద్యలో రాణించడమే కాకుండా సామాజిక చైతన్యంతో, సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలన్న ఉద్దేశంతో ఇక్కడ విగ్రహావిష్కరణ చేశామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.