ఆటపాటలతో హోరెత్తిన ఏపూరి పాటల ప్రవాహ సభ
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ ప్రజా ఉద్యమాల్లో పాటకు ఉన్న ప్రత్యేక స్థానం గుర్తించి చట్టసభల్లో పాటకు కూడా వాటా కల్పించాలని సురేష్ మహాజన డిమాండ్ చేశారు. ఏపూరి పాటల ప్రవాహ సభలో ఆయన ఆటపాటల ద్వారా ప్రజా సమస్యలను, బహుజనుల ఆకాంక్షలను వినిపిస్తూ గళమెత్తారు.
గద్దర్ అన్నను స్మరించుకుంటూ జెండాలు మోసిన జనాన్ని పోగుచేసి, ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లిన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. దండాలు పెట్టిన ప్రజల నుంచి కరపత్రాలు పంచిన వారు, పోస్టర్లు అతికించిన కార్యకర్తల వరకు అందరి కృషిని గుర్తుచేస్తూ “బహుజన మన బతుకెన్నడు మారురో మహాజన” అంటూ పాట ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
బండెనక బండి కట్టి.. 16 బండ్లు కట్టి..” అంటూ బండి యాదగిరి పాటను ప్రస్తావిస్తూ, ప్రజా ఉద్యమాల్లో పాటలు పోషించిన పాత్రను వివరించారు. అదేవిధంగా నవాబులకు సవాలు విసిరిన ఉద్యమ గీతాలు, తెలంగాణ దగాపడ్డ సందర్భాలను ప్రశ్నించిన గద్దర్ పాటలు, విమలక్క పాడిన “ఆడుదాం డప్పుల” పాట, జయరాజన్న “నెత్తురు పారింది ఎన్నడు” వంటి పాటలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం, ప్రజా పోరాటాల సమయంలో ప్రతిపక్షం లేని సందర్భాల్లో కూడా ప్రజల తరఫున ప్రశ్నించిన గొంతుకగా పాట నిలిచిందని సురేష్ మహాజన అన్నారు. ఏపూరి సోమన్న పాటలు కూడా ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నాయని పేర్కొన్నారు.
అన్ని ఇస్తుండ్రు గాని తమ్ముడా.. అధికారము ఎందుకు ఇస్తలేరు.. అడుగుదాము లెమ్మురా” అంటూ పాట ద్వారా ప్రశ్నించిన సురేష్ మహాజన, ప్రజల గొంతుకకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
చట్టసభల్లో పాటకు, కళాకారులకు, బహుజనుల గొంతుకకు తగిన వాటా కల్పించే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాల్లో పాటను కేవలం వినోదంగా కాకుండా సామాజిక మార్పుకు ఆయుధంగా చూడాలని పిలుపునిచ్చారు.

