కాంగ్రెస్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మీడియా ముఖంగా ఎదురు దాడి:
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై విమర్శలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నేతలు:
ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే రాజకీయ రంగు పులమడం తగదు, బీఆర్ఎస్
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మంగళవారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మీడియా ముఖంగా ఎదురు దాడికి దిగారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భూపాలపల్లి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఆయన సేవలందించారని, నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు.
గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు గండ్ర వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో భూపాలపల్లి పట్టణంలోని కస్తూర్బా, మైనారిటీ విద్యాలయాలు, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి అక్కడి సమస్యలను గుర్తించి ప్రజల దృష్టికి తీసుకువచ్చారని వివరించారు.మైనారిటీ విద్యాలయాల్లో తరగతి గదులు, హాస్టల్ వసతులు, పరిశుభ్రత, పిచ్చి మొక్కల పెరుగుదల, విషసర్పాలు, విషపురుగుల భయం వంటి అంశాలు విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారాయని ఆరోపించారు. ఈ సమస్యలను ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేయడమే తమ నాయకుడి ఉద్దేశమని, దీనిని రాజకీయ కోణంలో చూడడం కాంగ్రెస్ నాయకుల అవగాహన లేమికి నిదర్శనమని విమర్శించారు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలపై ఉన్న లోపాలను కూడా మాజీ ఎమ్మెల్యే ప్రస్తావించారని, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.ఆసుపత్రి, మైనారిటీ పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు లేవని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలంటే మీడియాతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించాలని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన రాజకీయ సంస్కృతి కాదని వ్యాఖ్యానించారు.
అలాగే, తమ నాయకుడిపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించిన బీఆర్ఎస్ నేతలు, ఆరోపణలకు ఆధారాలు ఉండాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులే తమ పార్టీ ఎమ్మెల్యేపై వివిధ ఆరోపణలు చేస్తున్నారని కూడా వారు పేర్కొన్నారు.చివరగా, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై వ్యక్తిగతంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిస్పందిస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

