జిల్లాలో 2,900 ఎకరాల్లో సాగు
భీమ్ ఇండియా టుడే జగిత్యాల వాణిజ్యం : జగిత్యాలజిల్లా మేడిపల్లి మండలం తొంబర్రావుపేట రైతు సురకంటి సతీశ్‌రెడ్డి 1.06 ఎకరాల్లో సరుగుడు మొక్కలు నాటారు. 26 నెలల తరువాత 60 టన్నుల కర్రల దిగుబడి వచ్చింది. టన్నుకు రూ.6,500 చొప్పున విక్రయించగా రూ.3.90 లక్షల ఆదాయం సమకూరింది. పెట్టుబడి కింద రూ.45 వేల ఖర్చయింది. లాభసాటిగా ఉండటంతో ప్రస్తుతం మరో 4 ఎకరాల్లో నాటారు.
సతీశ్‌రెడ్డి మాదిరిగానే ఉమ్మడి జిల్లాలో చాలా మంది రైతులు ఇటీవలి కాలంలో సరుగుడు, నీలగిరి (జామాయిల్), సుబాబుల్ తోటల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. మామిడి తోటలు లాభసాటిగా లేకపోవడం, ఇతర పంటలకు కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో తక్కువ శ్రమ, పెట్టుబడితో నికరాదాయం వచ్చేలా ఈ పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో దాదాపు 2,900 ఎకరాల్లో సరుగుడు, నీలగిరి, సుబాబుల్ తోటలు వేశారు.
స్థానిక విపణిలోనూ గిరాకీ
- సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లుతో బైబ్యాక్ ఒప్పందం చేసుకొని ఈ మొక్కలు నాటుతున్నారు. సరుగుడు ఒకేసారి కోతకు వస్తుంది. బయటి మార్కెట్లోనూ సెంట్రింగ్ తదితర అవసరాలకు సరుగుడు కర్రలను అధికంగా వినియోగిస్తున్నందున బయటి మార్కెట్లోనూ విక్రయిస్తున్నారు.నీలగిరి చెట్లు పెరిగిన తర్వాత కర్రలను కోశాక తిరిగి పిలకలు వచ్చి మరో పంట కూడా వస్తుంది. వీటిని కూడా బయటి మార్కెట్లో విక్రయించవచ్చు. సుబాబుల్‌ను మాత్రం కంపెనీకే విక్రయించాల్సి ఉంటుంది.నేల స్వభావం, నీటి వసతి, కలుపు నివారణ తదితర పరిస్థితులను బట్టి సరుగుడులో ఎకరాకు 50-60 టన్నులు, నీలగిరిలో 49-60 టన్నులు, సుబాబుల్లో 30-50 టన్నుల దిగుబడి వస్తుందని క్షేత్రాధికారి కుమారస్వామి తెలిపారు. సీజన్లను బట్టి ధరలో స్వల్ప మార్పులుంటాయన్నారు.
ప్రోత్సహిస్తే పెరగనున్న విస్తీర్ణం
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో సరుగుడు, నీలగిరి, సుబాబుల్ మొక్కలను రాయితీపై ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఉపాధిహామీ ద్వారా గుంతలు తీసి మొక్కలు నాటడం, కలుపు నివారణ రసాయనాలను వాడే అవసరం రాకుండా మల్చింగ్ కవర్లను, నీటిని పారించేందుకు బిందు సేద్యం పరికరాలను రాయితీపై ఇస్తే మరింత ప్రోత్సాహంగా ఉంటుందని విన్నవిస్తున్నారు. ఇదే తరుణంలో ధరలోనూ స్థిరత్వం ఉండేలా ప్రభుత్వం కంపెనీతో ఒప్పందం చేసుకుని రైతులతో సాగు చేయిస్తే పూర్తి భరోసాగా ఉంటుంది.
. సిర్పూర్ పేపర్ మిల్లు వద్ద జగిత్యాల జిల్లా రైతులు

