Friday, August 28, 2026
HomeEditorialయువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ

యువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ :- దేశ భవిష్యత్తుకు కీలకమైన జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 కి తగ్గించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో ఇందుకు అవసరమైన చట్టాన్ని సవరించాలని కోరారు.         ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర శాసనమండలి, శాసనసభలను ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి చట్టసభలకు పోటీ చేసే కనీస వయో పరిమితిని తగ్గించాలని ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి నివేదిస్తామని ప్రకటించారు.నీట్ లాంటి పరీక్షల విధానాల్లో లోపాలు, లీకేజీ కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, యువత పోరాటాలు సాగిస్తున్న నేపథ్యంలో “యువతే దేశం – దేశమే యువత” పేరుతో GenZ కి మద్దతుగా పీవీ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహ కూడలి వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థినీ, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ, 21 ఏళ్లకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌ అధికారులు అవుతున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. 21 ఏళ్లకు శాసనసభ, లోక్‌సభకు 25 ఏళ్లకు రాజ్యసభకు పోటీ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు.

శాసనసభ, లోక్‌సభ, రాజ్యసభలు వేదికగా యువత గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తగినట్టుగా పార్లమెంట్‌లో చట్ట సవరణ కోసం ప్రయత్నం చేస్తామని మాటిచ్చారు. యువతే ఈ దేశ భవిష్యత్తు, వారికేం కావాలో నిర్ణయించుకునే అధికారం కూడా యువతకు ఉండాలని, వారి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు చేసి రాణిస్తారని అన్నారు. దేశంలో యువకులు మార్గనిర్ధేశకులు కావాలన్న ఆలోచనతో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేశారు.

రాజీవ్‌ గాంధీ ఓటు హక్కు 21 ఏళ్ల నుంచి 18 కి తగ్గిస్తే, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావడానికి వీలుగా చట్ట సవరణ ద్వారా పోటీ చేయడానికి కనీస వయో పరిమితిని 21 ఏళ్లకు తగ్గించారని ప్రస్తావించారు.

జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 సంవత్సరాలు నిండితే చట్టసభలకు పోటీ చేయడానికి అవకాశం ఉందని, సింగపూర్‌లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే దేశానికి ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు మన దేశంలో ఆ పరిస్థితి ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.శాసనసభలో తీర్మానం చేసి ప్రధానమంత్రి గారికి పంపించడమే కాకుండా పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించే విధంగా ప్రయత్నం చేస్తామని మాట ఇచ్చారు. అలాగే 21 ఏళ్లు నిండిన వారే అత్యంత కీలకమైన విద్యా శాఖ, ఐటీ శాఖలకు మంత్రులైతే ఈ దేశ ముఖచిత్రం మారుతుందని అన్నారు.“జెన్ జీ వెల్లువ ఇంతటితో ఆగొద్దు. చట్టసభల్లో జెన్ జీ గళం వినిపించాలన్నదే నా ఆలోచన. రాబోవు రోజుల్లో యువత గళం వినిపించాలి. జెన్ జీ విజయం సాధించడానికి తామంతా బాధ్యత తీసుకుంటాం” అని పేర్కొన్నారు.

ఈ దేశాన్ని నిర్మించేది యువతేనని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో 30 శాతం ఉన్న జెన్ జీ (GenZ) చట్ట సభల్లో కనీసం ఒక్క శాతం ప్రాతినిధ్యం కూడా లేకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ ఆ అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.