ప్రారంభించిన నెలరోజుల్లోనే 3,885 కాల్స్
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, పారదర్శకమైన పాలనను అందించడం లక్ష్యంగా చేపట్టిన ‘మీ ఇంటి వద్దకే మీ-సేవలు’ అనే కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని మీ-సేవ కమిషనర్ రవికిరణ్ తెలిపారు. ప్రారంభించిన నెల రోజుల్లోనే అనూహ్య స్పందన లభించిందని, 3,885 కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ డోర్ స్టెప్ సేవలు ‘క్యూర్’ పరిధిలో అందుబాటులో ఉన్నాయని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రజలు ఇకపై ఆదాయ, కుల, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు.. ఆధార్ నమోదు, ఆధార్ వివరాల అప్డేట్ వంటి పలు సేవలను తమ ఇంటి వద్దనే పొందవచ్చు. ఇందుకోసం మీ సేవ కేంద్రాలు లేదా ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ‘మీ సేవ డోర్ స్టెప్ డెలివరీ సేవ’ ద్వారా సేవలను పొందే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రజలు టోల్‌ఫ్రీ నంబరు 1100కు కాల్ చేసి అభ్యర్థన నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ సేవ ప్రతినిధి ఇంటికి వచ్చి అవసరమైన సేవలను అందిస్తారు’’ అని రవికిరణ్ పేర్కొన్నారు.

