ఎస్సీ గురుకులాల కార్యదర్శి రవి గుగులోత్
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, అక్టోబర్ 8: ఎస్సీ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఎస్సీ గురుకులాల కార్యదర్శి రవి గుగులోత్ తెలిపారు. గురుకులాల పనితీరు, విద్యార్థుల సమస్యలు, విద్యా ప్రమాణాలపై బుధవారం జోనల్ అధికారులు, డీసీవోలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన సమీక్షించారు.
గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణంతో పాటు నాణ్యమైన వసతి, పారిశుధ్యం, భద్రత, ఆరోగ్యం, పోషకాహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థుల సమస్యలు, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా ప్రధాన కార్యాలయంలో 24 గంటల ప్రత్యేక టోల్‌ఫ్రీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
విద్యార్థుల సమస్యలను కేవలం పరిపాలనా స్థాయిలోనే కాకుండా క్షేత్రస్థాయిలోనూ పర్యవేక్షించాలని రవి గుగులోత్ ఆదేశించారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల్లో ఇంగ్లిష్ కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్ నైపుణ్యాలు, చదవడం, రాయడం వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందించాలని సూచించారు.
అదేవిధంగా గురుకులాల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారిత డిజిటల్ హాజరు విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. లైబ్రరీలు, ల్యాబ్‌లు, క్రీడా సామగ్రి, ఇతర విద్యా వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కార్యదర్శి రవి గుగులోత్ స్పష్టం చేశారు.

