Monday, October 19, 2026
Homeతెలంగాణఆదిలాబాద్ డీఈవో జారీ

ఆదిలాబాద్ డీఈవో జారీ

📰 Generate e-Paper Clip

విద్యా శాఖలో 93 మందికి షోకాజ్

భీమ్ ఇండియా టుడే న్యూస్ విద్యాశాఖలో 93 మందికి షోకాజ్ నోటీసులు జిల్లా పనితీరుపై రాష్ట్రస్థాయిలో అసంతృప్తి.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖలో షోకాజ్ నోటీసుల కలకలం కొనసాగుతోంది. అభ్యసన సామర్థ్యాలు, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాల్లో జిల్లా పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై రాష్ట్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విద్యాశాఖ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఇటీవల జిల్లా పనితీరుపై కలెక్టర్ రాజర్షి షా తీవ్రంగా పరిగణించి, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) మాధవికి షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశానికి సంబంధించి బాధ్యులుగా భావిస్తున్న జిల్లాలోని ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, సెక్టోరియల్ అధికారులకు డీఈవో మాధవి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

మొత్తం 93 మందికి సోమవారం షోకాజ్ నోటీసులు జారీ కావడం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. వీరిలో నలుగురు సెక్టోరియల్ అధికారులు, 71 మంది స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, 18 మంది ఎంఈవోలు ఉన్నారు. జిల్లా విద్యా పనితీరులో లోపాలకు సంబంధించిన అంశాలపై వీరి నుంచి వివరణ కోరినట్లు సమాచారం.

నోటీసులు అందుకున్న అధికారులు మూడు రోజుల్లోగా తమ వివరణను సమర్పించాలని డీఈవో ఆదేశించినట్లు తెలుస్తోంది. నిర్ణీత గడువులో వివరణలు అందజేయాలని, సంబంధిత అంశాలపై పూర్తి వివరాలను సమర్పించాలని సూచించినట్లు సమాచారం.

జిల్లాలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుదల, ఉపాధ్యాయుల పనితీరు, హాజరు శాతం, పాఠశాలల నిర్వహణ తదితర అంశాలపై అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 93 మందికి ఒకేసారి షోకాజ్ నోటీసులు జారీ కావడంతో జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై అధికారుల పర్యవేక్షణ మరింత కఠినతరం కానున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.