రూ.1.48 కోట్ల విలువైన ధనియాలు, కెమికల్ పౌడర్లు స్వాధీనం
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో ధనియాల ప్రాసెసింగ్ యూనిట్లలో కెమికల్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మండీ బజారులోని జ్యోతి ప్రాసెసింగ్ యూనిట్‌లో తనిఖీలు చేపట్టిన అధికారులు, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్న ముడి ధనియాలకు కెమికల్స్ కలిపి పొడిగా తయారు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
తనిఖీల సందర్భంగా భారీగా ధనియాలు, కెమికల్ పౌడర్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.48 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆహార పదార్థాల తయారీలో నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్ వినియోగిస్తున్నారన్న ఆరోపణలపై ప్రాసెసింగ్ యూనిట్ నిర్వాహకులు గాజులపల్లి రమేశ్, వినయ్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉండే విధానాల్లో ఆహార పదార్థాలను తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. ధనియాల ప్రాసెసింగ్ యూనిట్లలో తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

