భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్లో ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి నాలాలు, రోడ్ల ఆక్రమణలకు చెక్.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
హుజురాబాద్: పట్టణంలో వాణిజ్య వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రతి వ్యాపారి తప్పనిసరిగా పురపాలక సంఘం నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలని హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ సూచించారు. ప్రతి ఆర్థిక సంవత్సరానికి విధిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకుని మాత్రమే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
పట్టణంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు రోడ్లపై, నాలాలు, మురికి కాలువలపై వ్యాపార సామాగ్రిని ఏర్పాటు చేయడంతో పాటు కొందరు నాలాలు, రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లు మునిసిపల్ అధికారులు గుర్తించారు. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
పట్టణ ప్రజలు ఎవరూ నాలాలు, మురికి కాలువలు, రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టరాదని కమిషనర్ సూచించారు. అలాగే వ్యాపారులు తమ దుకాణాల సామాగ్రిని రోడ్లు, నాలాలు, మురికి కాలువలపై ఏర్పాటు చేయకుండా సహకరించాలని కోరారు. పట్టణ సుందరీకరణ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించే వారిపై, అలాగే రోడ్లు, నాలాలు, మురికి కాలువలను ఆక్రమించి నిర్మాణాలు లేదా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారిపై పురపాలక పరిపాలనా చట్టం–2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యాపారులు నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
సం/- కమిషనర్, హుజురాబాద్ మునిసిపాలిటీ

