Thursday, September 17, 2026
Homeతెలంగాణభూ దోపిడీ వ్యవహారాలన్నింటినీ ప్రత్యేక విచారణ టీమ్ కు రిఫర్

భూ దోపిడీ వ్యవహారాలన్నింటినీ ప్రత్యేక విచారణ టీమ్ కు రిఫర్

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ధరణిని అడ్డం పెట్టుకుని భూములను అక్రమంగా కొల్లగొట్టిన వ్యవహారాలపై ప్రత్యేక విచారణ బృందాన్ని SET ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  శాసనసభలో ప్రకటించారు. నిషేధిత జాబితా 22ఏపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి  సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. 

 భూములకు సంబంధించి ప్రధానంగా నాలుగు రకాల సమస్యలు కాలక్రమేణా తలెత్తాయని సవివరంగా సభ ముందు ఆవిష్కరించారు. జరిగిన భూ దోపిడీ వ్యవహారాలన్నింటినీ ప్రత్యేక విచారణ టీమ్ కు రిఫర్ చేస్తున్నట్టు తెలిపారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రస్తుతం ఎదుర్కొంటున్న భూ సమస్యల వరకు వివిధ అంశాలను సభలో వివరించారు.

 1908లో ప్రారంభమైన భూ రికార్డుల నుంచి 2011 వరకు వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలు, వాటి వల్ల ఉత్పన్నమైన పరిస్థితులను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. 1954-55లో వచ్చిన కాస్రా పహానీ, 1955లో ఇనాం భూముల చట్టం రద్దు, వినోబా బావే భూదానోద్యమం, 1965లో తీసుకొచ్చిన చట్టం, గిరిజనులు, ఆదివాసీలకు సంబంధించి 1/70 యాక్ట్, 1989లో కొత్త ఆర్వోఆర్ చట్టం, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ విధానం వంటి అంశాలను వివరించారు.

 భూములు అతికొద్ది మంది చేతుల్లో బంధీ అయిన నేపథ్యంలో 1973లో ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని, ఆ తర్వాత 1977లో అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా బదలాయింపును నిషేధించే చట్టం వచ్చిందని తెలిపారు. పోడు భూముల విషయంలో ఆదివాసీలకు రక్షణ కల్పించేందుకు 2006లో యూపీఏ ప్రభుత్వం ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు సభలో ప్రస్తావించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018లో ధరణి పోర్టల్ ప్రక్రియ ప్రారంభించే వరకు జరిగిన పరిణామాలను కూడా ముఖ్యమంత్రి వివరించారు. 2018లో ధరణి విధానం కోసం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థకు బాధ్యతలు అప్పగించారని, అక్కడి నుంచి టెరాసిస్, ఫాల్కన్ తదితర కంపెనీలకు.. వరుసగా చేతులు మారిన వైనాన్ని విడమరిచి చెప్పారు. 

 తెలంగాణ రైతాంగానికి సంబంధించిన సుమారు 2.50 కోట్ల ఎకరాల భూముల రికార్డులు, ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతా నంబర్లు, యజమానుల ఫోన్ నంబర్లతో సహా కామెరాన్ హైలాండ్స్‌కు తరలించిన విధానం జరిగిందని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా రికార్డులన్నీ విదేశీ శక్తుల చేతుల్లో పెట్టారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూ కబ్జాలను నిరోధించేందుకు 1982 జూన్‌లో ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని, తెలంగాణ ఏర్పడిన వెంటనే అప్పటి ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసిందని పేర్కొన్నారు. ఆ చట్టాన్ని ఎందుకు రద్దు చేశారన్న ప్రశ్నించారు. 

 ప్రైవేటు భూములకు సంబంధించి 3,73,930 ఎకరాలపై వివాదం ఉన్నట్లు ముఖ్యమంత్రి గారు సభకు వివరించారు. ప్రజల భూములను కాపాడటంతో పాటు భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు 2025లో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ధరణి పేరుతో జరిగిన అక్రమాలను నిరోధించి ప్రజల ఆస్తులను రక్షించేందుకు అన్ని వర్గాలతో, అన్ని స్థాయిల్లో చర్చించి, అంశాలను పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టి సమగ్ర ప్రక్షాళన దిశగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు.

నిషేధిత భూములకు సంబంధించి 22ఏ సెక్షన్‌ను తమ ప్రభుత్వం తీసుకురాలేదని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే 1999లో తొలిసారిగా సెక్షన్ 22ఏను తీసుకొచ్చారని తెలిపారు. భూదాన, వక్ఫ్, దేవాదాయ, ప్రభుత్వ భూములను రక్షించడమే దీని ఉద్దేశమని వివరించారు.

 నిషేధిత భూములను క్లాజుల వారీగా వర్గీకరించాలని 2015 డిసెంబర్‌లో ఫుల్ బెంచ్ తీర్పు ఇచ్చిందని, ఆ తర్వాత కటాఫ్ తేదీ తదితర అంశాల నేపథ్యంలో జరిగిన లావాదేవీలు, పరిణామాలతో వివాదాలు తలెత్తాయని తెలిపారు. ఒక సర్వే నంబర్‌లో ఒకచోట వివాదం ఉంటే మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో చేర్చడంతో సమస్య మరింత పెరిగిందన్నారు. ఇలా సుమారు మూడు లక్షలుగా ఉన్న వివాదాలు 30 లక్షల ఎకరాలకు పెరిగాయని చెప్పారు.

 2020 అక్టోబర్‌లో 7,91,542 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విస్తీర్ణాన్ని 3,73,930 ఎకరాలకు తగ్గించినట్లు ముఖ్యమంత్రి గారు తెలిపారు. అలాగే పార్ట్-బీలోని వివాదాస్పద భూములను 17 లక్షల ఎకరాలకు తగ్గించామని చెప్పారు. 22ఏ నిషేధిత జాబితాను గత డిసెంబర్‌లోనే అప్‌డేట్ చేసినప్పటికీ చాలామంది ఈ విషయాన్ని గమనించలేదన్నారు.

 నిషేధిత జాబితాకు సంబంధించి ప్రధానంగా ఎనిమిది అంశాలకు పరిష్కారం అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే నిషేధిత జాబితా కొనసాగుతోందని, ప్రజా ప్రభుత్వం కొత్తగా భూములను జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు.

 ఇకపై ఏదైనా భూమిని 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చాలంటే సంబంధిత కలెక్టర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సంబంధిత వ్యక్తి అభ్యంతరాలు, అవసరమైన రికార్డులను పరిశీలించి, విచారణ చేపట్టిన తర్వాతే భూమిని నిషేధిత జాబితాలో చేర్చాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ నిర్ణయంపై అసంతృప్తి ఉంటే 60 రోజుల్లో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తామని, ఆ తర్వాత 90 రోజుల్లో రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటు ఉంటుందని వివరించారు.

 దేవాదాయ, వక్ఫ్ రికార్డులను పరిశీలించి భూముల స్థితిని నిర్ధారిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వాటిలో కొంత భాగం మాత్రమే వివాదాస్పదంగా ఉంటే ఆ భాగాన్ని మాత్రమే నిషేధిత జాబితాలో కొనసాగించి, మిగిలిన భూమిని జాబితా నుంచి తొలగిస్తామని చెప్పారు.

 నిషేధిత జాబితాపై ప్రజల్లో నెలకొన్న అనుమానాల నేపథ్యంలోనే శాసనసభలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రస్తుత సమావేశాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా రంగం, ఎల్‌నినో ప్రభావం, కరవు పరిస్థితులు వంటి కీలక అంశాలపై చర్చించాలని ప్రభుత్వం ముందుగానే నిర్ణయించిందని తెలిపారు. ఈ సీజన్‌లో విద్యుత్ వినియోగం ఒకేరోజు 19,500 మెగావాట్ల అత్యధిక డిమాండ్‌కు చేరిందని పేర్కొన్నారు. ఇలా అన్ని ప్రధాన అంశాలపై చర్చ జరగాలని ప్రభుత్వం భావించిందన్నారు.

 వారసత్వంగా వచ్చిన సమస్యలపై శాసనసభలో చర్చించుకున్న తర్వాత తప్పిదాలకు తావులేకుండా ప్రతిపక్షాలు అవసరమైన సూచనలు ఇస్తే ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

రాష్ట్రంలో నిరుపేదలకు చెందాల్సిన లక్ష కోట్ల రూపాయల విలువైన భూములు దోపిడీకి గురయ్యాయని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, భూముల దోపిడీని క్షమిస్తే భవిష్యత్ తరాలు క్షమించవని వ్యాఖ్యానించారు.

 ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడిన వ్యవహారాలను ప్రభుత్వం ఉపేక్షించబోదని ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు. అలాంటి అన్ని వ్యవహారాలను ప్రత్యేక విచారణ బృందానికి రిఫర్ చేస్తామని, భూ దోపిడీకి పాల్పడిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపిస్తామని సభలో ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.