పేపర్ కథనం చూసినా స్పందించని అధికారులు
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారంటూ ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మహిళా మోర్చా అధ్యక్షురాలు నాంపల్లి మమత, గురుకుల పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లారు.
విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, ఆహారం నాణ్యత, అల్పాహారం సమయపాలన, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ నాయకులకు గురుకుల ప్రిన్సిపాల్ నుంచి సరైన స్పందన లభించలేదని వారు ఆరోపించారు. హెడ్ ఆఫీస్ పర్మిషన్ కావాలంటూ లోపలికి అనుమతించకుండా తప్పించుకున్నారని తెలిపారు.
పేపర్ కథనం చూసినా పట్టించుకోని వైనం..
గురుకులంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ, సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తుతో ముడిపడిన సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి
ఎల్కతుర్తి బాలికల గురుకులంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వంట సిబ్బంది పనితీరు, పరిశుభ్రత, టెండర్ల కేటాయింపు తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

