Friday, September 11, 2026
Homeఆంధ్ర ప్రదేశ్కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంస్మరణ సభ

కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంస్మరణ సభ

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ రవీంద్ర భారతి.  ఆరు దశాబ్దాల పాటు మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం తన జీవితాన్ని సర్వం ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి గారని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు.

రవీంద్రభారతిలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు.

 భూమిలోని సారం నుంచి ప్రారంభించి దానికి అవసరమైన నీరు, విత్తనం, పెట్టుబడి, పంట, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వరకు రైతుల సమస్యలను లోతుగా విశ్లేషించి సంపూర్ణ అవగాహనతో పోరాటం చేసిన మల్లారెడ్డితో ఎవరూ పోటీ పడలేరని అన్నారు. వ్యవసాయ రంగంలోని సమస్యలపై నిశితంగా అవగాహన కలిగిన వాకింగ్ ఎన్‌సైక్లోపీడియాగా అభివర్ణిస్తూ, అలాంటి రైతు నాయకుడిని కోల్పోవడం రైతాంగానికి తీరని లోటు అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

 సమాజంలో ఎంతో మంది హోదా గుర్తింపు రావాలని కోరుకుంటారని, కానీ సారంపల్లి మల్లారెడ్డి గారి శ్రమ రైతులు, రైతు కూలీలకు ఉపయోగపడాలని కాంక్షించి జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని కొనియాడారు.

 సమస్యల పట్ల అవగాహన ఉంటే పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని, రైతుల సమస్యల పట్ల సారంపల్లి రాసిన పుస్తకాలు, లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. కమ్యూనిస్టులు పోరాటాలు చేసినప్పుడు తమ ప్రభుత్వం వాటిని పరిష్కరించిందని పలు సందర్భాలను ముఖ్యమంత్రి  ఉటంకించారు.

 రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేసి భూమిలేని నిరుపేద కూలీలకు కనీస వేతనం ఉండాలని వామపక్ష యోధులు పోరాటాలు చేస్తే దాన్ని ఆధారం చేసుకుని తమ ప్రభుత్వాలు కనీస వేతన చట్టం చేసిందని గుర్తుచేశారు.

 దున్నేవాడికే భూమి చెందాలన్న పోరాట నేపథ్యం నుంచి ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను తెచ్చి దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు పోడు భూములు, మిగులు భూములను పంచిందని, 24.56 లక్షల ఎకరాల పట్టాలను అందించిందని చెప్పారు.నిరుపేదలకు ఉండటానికి ఇళ్లు ఉండాలని వామపక్షాలు లేవనెత్తినప్పుడు దేశంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేశామన్నారు. భూమి మీద ఏ వస్తువు తయారైనా తయారు చేసిన వారే అమ్మకం ధర నిర్ణయిస్తున్నారని, కానీ దురదృష్టవశాత్తు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. ఈ విషయంలో కమ్యూనిస్టులు ఉద్యమాలు సాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్‌ను నియమించి కనీస మద్దతు ధర అమలులోకి తెచ్చిందని పేర్కొన్నారు.

నిరుపేదలకు పనిదొరకని పరిస్థితుల్లో వామపక్షాల సహకారంతో ఉపాధి హామీ చట్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అదే కోవంలో కరవుతో అల్లాడుతున్న పేదల కోసం కమ్యూనిస్టులు పోరాడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రత తీసుకొచ్చిందని చెప్పారు.

ఈ రకంగా వామపక్షాలు సమస్యలపై పోరాటాలు సాగిస్తూ పరిష్కారానికి సూచనలు చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటిని పరిష్కరించాయని వివరించారు.

మారుమూల గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారితో పాటు లోపాల పేరుతో ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సమస్యలపై ఎర్రజెండా పోరాటాలంటే ప్రజలకు ఒక నమ్మకం అని చెబుతూ ఎస్ఐఆర్ విషయంలో కూడా ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు.

 సమావేశంలో నేతలు లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ, కమ్యూనిస్టు యోధుడు సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టినట్టుగానే, రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి గారి సేవలు చిరస్థాయిలో గుర్తిండిపోయే విధంగా మంత్రివర్గంలో చర్చించి మంచి కార్యక్రమం తీసుకుంటామని స్పష్టం చేశారు.

 ఈ కార్యక్రమంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ గారు, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఎం నాయకులు ప్రకాశ్ కారత్ గారు, జాన్ వెస్లీ గారితో పాటు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.