రాజధాని వేదికగా రూపొందిన ‘ఫార్‌సైట్’ వీడియోగేమ్
డెబ్యూ ట్రైలర్‌కు ప్రపంచ వ్యాప్తంగా స్పందన
ఫార్‌సైట్ గేమ్
భీమ్ ఇండియా టుడే హైదరాబాద్ : విదేశీ పబ్లిషర్ల కోసం ఆర్ట్, యానిమేషన్, ఇంజినీరింగ్ పనులకు అవుట్ సోర్సింగ్ చేయడానికే భారత గేమింగ్ పరిశ్రమ పరిమితమైందనే ముద్రను చెరిపేస్తూ నగరానికి చెందిన ‘స్టూడియో నూరీ’ సంస్థ రూపొందించిన ‘ఫార్‌సైట్’ వీడియోగేమ్ ప్రపంచ గేమింగ్ రంగం దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ వేదికగా రూపుదిద్దుకున్న ఈ సైకలాజికల్ హర్రర్ గేమ్ విడుదలకు ముందే అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐజీఎన్ ‘ఫార్‌సైట్’ గేమ్‌ను దీనిని ప్రత్యేకంగా ప్రదర్శించింది. ‘ది గేమ్ అవార్డ్స్’ అధికారిక యూట్యూబ్ ఛానల్లోని ‘ఇండియా గేమ్స్ షోకేస్’లో చోటు దక్కగా లక్షలాది మంది వీక్షించారు. ఆసియా, యూరప్, అమెరికా ఖండాల్లో సామాజిక మాధ్యమాల్లోనూ ఈ గేమ్ గురించి చర్చ జరుగుతోంది.
ఆలోచన వచ్చిందిలా..
కంటి పరీక్ష యంత్రమే కథావస్తువుగా తీసుకొని గేమ్‌ను రూపొందించినట్టు స్టూడియో నూరీ వ్యవస్థాపకుడు, నగరంలోని యాప్రాల్‌కు చెందిన అంచిత్శర్మ తెలిపారు. 15 మంది నిపుణులతో, దాదాపు రూ.30 కోట్ల భారీ వ్యయంతో ఈ గేమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. యూట్యూబ్‌లో విడుదలైన ఈ గేమ్ డెబ్యూ ట్రైలర్ ఇప్పటికే ఒక మిలియన్ (10లక్షలు) వ్యూస్ మార్క్ దాటింది.
కంటి పరీక్ష మిషన్ వెనక ప్రపంచం..
ఈ గేమ్ కథాంశం చాలా భిన్నంగా, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేలా ఉంటుంది. ఈ గేమ్‌లో 12 ఏళ్ల బాలుడు కంటి పరీక్ష కోసం నేత్ర వైద్యుడి వద్దకు వెళ్తాడు. పరీక్ష మొదలవగానే ఆ కంటి మిషన్‌లో కనిపించే సుదూర కొండపై ఉన్న ఒకే ఒక ఇల్లు, మైదానాల లోపలికి వెళ్లిపోతాడు. ఆ ప్రపంచంలో చిక్కుకున్న బాలుడు.. బైనాక్యులర్స్, తాళాలు, వింటేజ్ కెమెరా తదితర వస్తువులతో రహస్యాలను ఛేదించి బయటపడాలి.
భయపెట్టడానికి కాదు
ఈ గేమ్ కేవలం భయపెట్టడానికి కాదు. 12 ఏళ్ల వయసులో ఒంటరితనం వీడి సురక్షితమైన ప్రదేశానికి పారిపోవాలనే ఒక పిల్లాడి కోరికను ఇది ఆవిష్కరిస్తుంది. గేమింగ్ రంగంలో అనుభవమే దీనిని రూపొందించడానికి ఉపయోగపడింది. గతంలో లండన్‌కు చెందిన నైట్రోమ్ సంస్థలో పనిచేశాను. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘ఫియర్స్ టు పాథమ్’ సిరీస్ ఎపిసోడ్స్ 4, 5లకు లీడ్ డెవలపర్‌గా పని చేశాను.
అంచిత్శర్మ, క్రియేటివ్ డైరెక్టర్, స్టూడియో నూరీ వ్యవస్థాపకుడు

