ఓ వైపు ఆప్తులు చనిపోయిన బాధలో కుటుంబీకులు ఉంటే.. మరోవైపు బంగారం కోసం శ్మశానవాటిక నుంచి మృతదేహం కాలుతుండగానే బూడిద మాయం చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబంలో ఎవరైనా మహిళ మరణిస్తే అంత్యక్రియల సమయంలో నోటిలో బంగారు గుండు పెట్టి నిప్పటించడం గ్రామాల్లో ఆనవాయితీగా వస్తోంది. కొందరు మహిళల కాలి వేలికి అమర్చిన వెండి మట్టెలు, కడియాలు కూడా తొలగించకుండా అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. వారి నోటిలో పెట్టే బంగారు గుండు, ముక్కు పుడక కోసం దుండగులు చితి పూర్తిగా కాలకముందే ఆ ప్రాంతంలోని బూడిదను సంచిలో నింపుకుని ఎత్తుకెళుతున్నారు. అందులోని బంగారం, వెండి విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
జరిగిన ఘటనలు
మల్యాలలో మూడు రోజుల క్రితం మృతి చెందిన ఓ మహిళ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లిపోగానే కొందరు దుండగులు అక్కడికి చేరుకుని చితి పూర్తిగా ఆరకముందే తల భాగంలో నీరు పోసి బూడిద ఎత్తుకెళ్లారు. వారిని పట్టుకోవడానికి పలువురు గ్రామస్థులు వెంటపడగా తప్పించుకుని పారిపోయారు.
గతంలో స్థానిక నాయకుడొకరు మరణిస్తే ఆయన చేతికున్న ఒక బంగారు ఉంగరం తొలగించకుండా అంత్యక్రియలు నిర్వహించారు. ఓ వ్యక్తి శ్మశానవాటిక సమీపంలో చితి ఆరేవరకు నిరీక్షించి దానిని సేకరించుకొని వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో దాదాపు ప్రతి మృతురాలి అంత్యక్రియల సందర్భంగా చితి నుంచి బూడిద సేకరించుకొని వెళ్లే ముఠాల మధ్య పోటీ ఏర్పడినట్లు తెలిసింది. బూడిద ఎత్తుకెళ్లే సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే గతంలో ఓ దుండగుడు దాడి చేశాడని సమాచారం.
సమాచారం ఇస్తే నగదు
బంగారం ధర విపరీతంగా పెరగడంతో ఇలా చేస్తున్నారని పలువురు వివరించారు. ఒక గ్రాము బంగారం లభించినా దాదాపు రూ.10వేల వరకు వస్తోంది. గ్రామంలో ఎవరైనా మహిళ మరణిస్తే గ్రామంలోని కొందరు వ్యక్తులు బూడిద ఎత్తుకెళ్లే దుండగులకు సమాచారం అందిస్తారు. వెంటనే శ్మశానవాటిక పరిసరాల్లోకి చేరుకుని కుటుంబీకులు వెళ్లిపోయిన తర్వాత బూడిదను సేకరిస్తారు. బంగారు గుండు కోసం వెతుకులాడుతారు. తమకు సమాచారం ఇచ్చిన వ్యక్తులకు దుండగులు రూ.500 నుంచి రూ.1000ల వరకు ఇస్తారని శ్మశానవాటిక నిర్వాహకుడు తెలిపారు.