Friday, August 28, 2026
HomeEditorialమత్తు దందా.. కొత్త పంథా

మత్తు దందా.. కొత్త పంథా

📰 Generate e-Paper Clip

 

      చాక్లెట్ రూపంలో గంజాయి విక్రయంరూరల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి, చాక్లెట్లు

భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ కొత్తపల్లి:జిల్లాలో మత్తుపదార్థాల రాకెట్‌ రోజుకోరీతిన వెలుగు చూస్తోంది. గంజాయి విక్రయాలపై అధికారులు ఉక్కుపాదం మోపడంతో గంజాయి ముఠా తమ పంథా మార్చింది. తాజాగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో చాక్లెట్లు తయారు చేస్తున్నారు. పిల్లలు, యువత లక్ష్యంగా గంజాయి చాక్లెట్లతో మార్కెట్‌ను ముంచెత్తుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి చాక్లెట్లను పోలీసులు పట్టుకుంటున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల నుంచి..

ఈ చాక్లెట్లు ఉత్తరాది రాష్ట్రాల నుంచి జిల్లాకు సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నాందేడ్, బిహార్, పశ్చిమబెంగాల్‌ ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కరీంనగర్‌కు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన యువత గోవా, ముంబయి, ఇతర ప్రాంతాలకు విహారానికి వెళ్లి మత్తు పదార్థాలను అలవాటు చేసుకుని వారితోపాటు గంజాయి చాక్లెట్లు అక్రమంగా వెంట తెచ్చుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరకు తెచ్చే వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తే మరింత పట్టుబడే అవకాశం ఉంది.

విద్యార్థులే లక్ష్యం..

విద్యార్థులు, యువకులను లక్ష్యంగా చేసుకుని చాక్లెట్లను ఇంజినీరింగ్‌ కళాశాలలు, వైద్య కళాశాలలు, ప్రఖ్యాత కేఫ్‌లు, కొన్ని ప్రత్యేక పాన్‌షాపులు, నిర్మానుష్య, శివారు ప్రాంతాల్లోని టీస్టాళ్లు, పాన్‌ డబ్బాల్లో విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నల్లమందు, గంజాయి లిక్విడ్‌తో శొంఠి, జీలకర్ర, కిస్మిస్‌ తదితర వస్తువులను కలిపి ఈ చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. గంజాయి చాక్లెట్లను గోలీలుగా చేసి ప్యాకింగ్‌లో ఉంచుతున్నారు. ఇలా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. చిన్న పొట్లాలుగా విక్రయిస్తుండటంతో ఇప్పటి వరకు అనుమానాలు రావడం లేదు.

నోటితో తీసుకోవడం ప్రమాదం

చాక్లెట్లు, బ్రౌనీస్, కేక్స్, పకోడీల రూపంలోనూ గంజాయిని తీసుకుంటున్నట్లు తేలింది. పొగ రూపంలో గంజాయి నిమిషాల్లోనే మెదడు మీద ప్రభావం చూపుతుంది. అదే చాక్లెట్ల రూపంలోనైతే అరగంట నుంచి గంట వరకు పట్టొచ్చు. దీంతో ప్రభావం చూపడం లేదని ఎక్కువెక్కువ తీసుకుంటున్నారు.

ఈ నెల 15న రూరల్‌ మండలం నగునూరు గ్రామానికి చెందిన జి.శ్రీరాం(20), కె.వేణు(21)లు నాందేడ్‌ నుంచి అరకిలో గంజాయి, చాక్లెట్లు తీసుకుని వచ్చి మండలంలోని బొమ్మకల్‌ శివారులో విక్రయించేందుకు చూస్తుండగా రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి తన బృందంతో పట్టుకున్నారు. 94 గ్రాముల గంజాయి, ఆరు గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెల 24న చిగురుమామిడి మండలం ఇందుర్తిలోని ఓ దుకాణంలో డ్రగ్స్‌తోపాటు గంజాయి చాక్లెట్లను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. కళాశాలల ముందు విక్రయాలకు వీటిని నిల్వ చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.