Friday, August 28, 2026
HomeEditorialప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం

ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్:-  ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో దివీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను అందించాయి. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియాన్‌లో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, దివీస్, అరబిందో ఫార్మా కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలిశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం సీఎస్‌ఆర్‌ నిధుల కింద దివీస్ సంస్థ రూ. 12.18 కోట్లు, అరబిందో ఫార్మా రూ. 10 కోట్లకు సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఫౌండేషన్‌కు అందజేశారు.

 ప్రభుత్వ పాఠశాలల్లో హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ పథకం కోసం సీఎస్ఆర్ నిధులను అందించిన దివీస్‌, అరబిందో సంస్థలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభినందించారు.

 ఆ పథకం అమలు కోసం హరే కృష్ణ ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్‌లను ఏర్పాటు చేసిన చోట సమీప ప్రాంతాల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రతినిధులకు వివరించారు. అవసరమైన కూరగాయలు, బియ్యం ఇతర సామగ్రిని నేరుగా రైతుల నుంచి తీసుకునేలా, రైతులను ఆర్గానిక్ పంటల వైపు ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

 రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తద్వారా పంటమార్పిడి విధానాన్ని ప్రోత్సహించడమే కాకుండా రైతులకు లాభాలను అందించవచ్చని ముఖ్యమంత్రి గారు అన్నారు.  

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె రామకృష్ణారావు గారు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ గారు, హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర దాస ప్రభు జీ గారు, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ మధు బాబు గారు, అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి గారు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో ఆయా సంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో మాదక ద్రవ్యాలకు సంబంధించి జరిగే ఏ ఘటననైనా యాజమాన్యం కూడా బాధ్యత వహించాలని చెప్పారు.రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించి తీసుకునే చర్యల్లో భాగంగా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ అవసరమైతే ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీలపై ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియాన్‌లో ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్ మహమ్మారిని నిరోధంలో యాజమాన్యాలకు కూడా బాధ్యత ఉంటుందని అన్నారు. ఇందుకు సంబంధించి క్యాంపస్ బయట జరిగే కార్యకలాపాలను సైతం గుర్తించి సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని చెప్పారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందని, వాటిని నిరోధంలో విద్యా సంస్థలకు అధికారాలతో పాటు బాధ్యతలను కూడా అప్పగించాలని చెప్పారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలని అన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి సమాచారం అందించేందుకు విద్యా సంస్థల ఆవరణలో టోల్‌ఫ్రీ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు చెప్పారు. డ్రగ్స్‌కు సంబంధించి కార్యకలాపాలను గుర్తించడం, వినియోగిస్తున్న వారిని మాన్పించడం, శిక్షించడం అన్న మూడు దశలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్ తీసుకుని పట్టుబడితే డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపించడం, కౌన్సిలింగ్ ఇప్పించడమే కాకుండా తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి గారు, కె రామకృష్ణారావు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, డీజీపీ సీవీ ఆనంద్ గారు, ఈగల్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.