పేద రైతుల భూములను కాపాడాలి ఎల్లాపూర్ రైల్వే స్టేషన్‌లో 439 సర్వే నంబర్ సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిరసన
బీమ్ ఇండియా టుడే ఎల్లాపూర్: హనుమకొండ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో ఉన్న 439 సర్వే నంబర్ పంచరాయి భూముల విషయంలో పేద రైతులకు న్యాయం చేయాలని కోరుతూ, హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ రైల్వే స్టేషన్‌లో 439 సర్వే నంబర్ సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
దండేపల్లి గ్రామంలోని 439 సర్వే నంబర్‌లో ఉన్న భూమిని పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం కేటాయించడం వల్ల ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న సుమారు 260 మంది పేద రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాల జీవనోపాధికి విఘాతం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
పేద రైతుల జీవనోపాధికి విఘాతం కలిగించవద్దు
జిల్లా కలెక్టర్, ఎల్కతుర్తి తహసీల్దార్ సంబంధిత అంశంపై సమగ్ర విచారణ జరిపి, భూముల వివరాలను పరిశీలించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పేద రైతులకు నష్టం కలగకుండా చూడాలని, ఈ భూముల్లో పెట్రోల్ బంక్ ఏర్పాటు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పేద రైతుల హక్కులను పరిరక్షిస్తూ, వారి జీవనోపాధికి భరోసా కల్పించేలా అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
నిరసనలో పాల్గొన్నవారు:
439 సర్వే నంబర్ సంరక్షణ సంఘం అధ్యక్షులు కామర లక్ష్మణ్, జూపాక రాజేశ్వరి, గడ్డంసంధ్య, గడ్డం పూలమ్మ, జాజాల రాములు, సదీరం రాధమ్మ, గుంటి నారాయణ, రేణికుంట్ల సాంబయ్య, పిల్లి సదానందం, సదిరం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

