భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ రెండు సంవత్సరాలపాటు సహకరించి వెసులుబాటు కల్పిస్తే పీఆర్సీ, ఇంక్రిమెంట్ల వంటి ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టిన ఈ దశలో తెలంగాణ విద్యా వ్యవస్థను భారతదేశానికి ఒక దిక్సూచిలా నిలబెట్టడానికి ఉపాధ్యాయులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహదారు కే కేశవరావు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
భారతదేశ మాజీ రాష్ట్రపతి, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ఆర్థిక వెసులుబాటును బట్టి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. మిగతా శాఖలతో పోల్చితే విద్యా శాఖ ఆదర్శంగా నిలబడాలి. పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శకులు మీరే. రెండేండ్లు సమయం ఇవ్వండి. రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడికి విజ్ఞప్తి చేస్తున్నా. రెండేండ్లలో సమస్యలన్నింటినీ సామరస్యంగా మీరు అడక్కుండానే పరిష్కరించే బాధ్యత నాది” అని స్పష్టం చేశారు.
తెలంగాణ విద్యా వ్యవస్థను భారతదేశానికి ఒక రోల్ మాడల్‌గా నిలబెడుదాం. అందుకు కథానాయకులు ఉపాధ్యాయులే. అందుకు ఉపాధ్యాయులంతా పునరంకితం కావాలి. ఇంట్లో సొంత పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో మీ వద్ద చదువుకుంటున్న విద్యార్థుల విషయంలోనూ అంతే శ్రద్ధ పెట్టాలి. ఉపాధ్యాయులపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది.
ప్రభుత్వ సర్వీసులో మీరు 30 ఏళ్లకు పైగా సేవలందిస్తారు. రాజకీయ నాయకులం ప్రతి ఐదేళ్లకు ఒకసారి మీముందుకొచ్చి పరీక్షలు రాయాల్సిందే. నేను చెప్పిన ప్రకారం చేయకుండా ఉంటే.. నిర్ణయం తీసుకోవలసింది మీరే. అందుకు మార్కులు వేయాల్సిందీ మీరే. మీ చేతిలోనే కలం ఉంది. మీ చేతిలోనే బలం ఉంది” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ఉపాధ్యాయులే వీధుల్లోకి వస్తే ప్రభుత్వానికి, రాష్ట్రానికి శుభ సూచకం కాదు. మిగతా శాఖలు వేరు. పిల్లల భవిష్యత్తుకు నిర్దేశకులు మీరు. మీరే ధర్నాలు చేస్తానంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా. రెండేళ్లు సమయం ఇవ్వండి.
ఉపాధ్యాయులు, లెక్చరర్లకు అణాపైసా కష్టం రానివ్వను. పీఆర్సీ, ఇంక్రిమెంట్‌లతో పాటు మిగతా సమస్యలు వేటిలోనూ చిన్న కష్టం రానివ్వను. సలహాదారు కేశవరావు గారితో కూర్చొని మాట్లాడండి. నన్ను విశ్వసించి సహకరించండి” అని విజ్ఞప్తి చేశారు

