Thursday, August 27, 2026
Homeఅంతర్జాతీయంలండన్: తెలంగాణలో విద్యా కార్యక్రమాలు పెద్ద ఎత్తున

లండన్: తెలంగాణలో విద్యా కార్యక్రమాలు పెద్ద ఎత్తున

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ లండన్: తెలంగాణలో విద్యా కార్యక్రమాలు పెద్ద ఎత్తున విస్తరించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  లండ‌న్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం ప‌లికారు. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో శుక్రవారం 900 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించింది.

 తెలంగాణతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై ప్రముఖ విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లోవాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు.

 ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌ను వారికి సమగ్రంగా వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, చేపడుతున్న చర్యలను వివరించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తమ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, ప్రత్యేక పరిశోధన సామర్థ్యాలు, విస్తృతమైన విద్యా వ్యవస్థను హైదరాబాద్‌కు తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణ యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన అవకాశాలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కీల‌క‌ సమావేశంలో సీఎం కార్యాలయ సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు  పాల్గొన్నారు. 

 కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం కింద విదేశీ విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉన్న అవకాశాలపై ఆయన సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్, తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న అవకాశాలు, వాటికి లభించే ప్రయోజనాలను వివరించారు.

 తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న పలు అవకాశాలను ఈ సంద‌ర్భంగా వారు ప్రస్తావించారు. 

 డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ బృందం ఆహ్వానించింది. అనంతరం ముఖ్యమంత్రి గారు చారిత్రక సోమర్‌విల్ కాలేజీని సందర్శించారు. ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారి చిత్రపటాన్ని తిలకించారు. 2002లో సోనియా గాంధీ ఈ చిత్రపటాన్ని సోమర్‌విల్ కాలేజీకి బహూకరించిన విష‌యం తెలిసిందే.

అనంతరం ముఖ్యమంత్రి, అక్క‌డే జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్‌ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథి గారితో కలిసి అక్కడి సమగ్ర క్రీడా సదుపాయాలను పరిశీలించారు.

 ఈ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్స్‌తో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హోటల్ ఉన్నాయి. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి గారు జీఎంఆర్ ప్రతినిధులు, సంస్థ గ్లోబల్ స్పోర్ట్స్ యూనిట్‌తో మంత‌నాలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు. 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.