భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, పాలిటెక్నిక్ విద్యలో తీసుకొచ్చిన మార్పులు, వాటిపై విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు.. వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు గారు శాసనసభ వేదికగా స్పష్టమైన వివరణ ఇచ్చారు.
రాష్ట్ర విద్యా విధానంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన సమాధానమిచ్చి ఆయా వర్గాల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలను నివృతి చేశారు.
పాలిలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరుగుతుందనే ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విద్యార్థులు ఎవరి చేతుల్లోనో పావులుగా, కీలుబొమ్మలుగా మారొద్దని కోరారు. ముందు యుగం దూతలుగా మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నామని, నిజాయితీగా వివరాలందించిన కాలేజీల రీయింబర్స్మెంట్ బకాయిలను విడతల వారిగా చెల్లిస్తామని చెప్పారు.
ప్రజాప్రభుత్వం విద్యా రంగానికి ఎందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందో సభలో వివరించిన ముఖ్యమంత్రి గారు సభ్యులు లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానమిచ్చారు.
ముఖ్యంగా పాలిటెక్నిక్ కళాశాలలను విద్యాశాఖ పరిధి నుంచి స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీయడానికి కాదని, వారిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకేనని తెలిపారు.
ఈ విషయంలో ఇప్పటికీ అనుమానాలుంటే సభ్యులు, నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, చర్యలు చేపట్టి సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
విద్య ఒక్కటే మన జీవితాల్లో వెలుగును తీసుకొస్తుంది” అనే సంపూర్ణ విశ్వాసంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులు కాకుండా విద్య లేకపోవడమే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలించేందుకు కే కేశవరావు గారి నేతృత్వంలో కమిటీని నియమించాం. సభ్యులు, విద్యా రంగ నిపుణులు ఎవరైనా తమ సూచనలు, సలహాలను కమిటీకి అందిస్తే వాటిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
విద్యాశాఖను ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహించడం ఆ శాఖకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. తాను విద్యాశాఖపై ఒక తపనతో పనిచేస్తున్నా. ముఖ్యమంత్రి హోదాలో విద్యాశాఖను సమీక్షిస్తే మొత్తం వ్యవస్థపై సమగ్ర సమీక్ష జరుగుతుంది.
2023-24లో గత ప్రభుత్వం విద్యాశాఖకు రూ.19,093 కోట్లు కేటాయించగా, తమ ప్రభుత్వం 2024-25లో రూ.21,292 కోట్లు కేటాయించాం. 2025-26లో రూ.23,108 కోట్లకు, 2026-27లో రూ.26,647 కోట్లకు పెంచాం. కేవలం మూడేళ్లలోనే విద్యాశాఖ బడ్జెట్‌ను రూ.7,554 కోట్ల మేర పెంచాం” అని ముఖ్యమంత్రి గారు సభ ముందు వివరించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కేవలం 55 రోజుల్లో 10,006 మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7,857 మంది ఉపాధ్యాయులను మాత్రమే నియమించింది” అని పేర్కొన్నారు.
జెన్ జీ ఒక్కటే కాదు. రానున్న జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానాన్ని రూపొందిస్తున్నాం. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది.. తలరాతలను మార్చేది విద్య” అనే నమ్మకంతోనే విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నా. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తెలంగాణకు తీసుకొచ్చేందుకు, దేశానికి తెలంగాణను ఒక రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం” అని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న ఆదరణ
“విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేల మేర పెరిగిందని సీఎం తెలిపారు. ఇది తన పనితీరుకు నిదర్శనమన్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో రెండున్నరేళ్లకే పిల్లలను చేర్చుకుంటుండగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఐదేళ్ల వయసు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. నర్సరీ, ఎల్‌కేజీతో పాటు ఇంగ్లిష్ మీడియం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్తున్నారు.
అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా ప్రీ-ప్రైమరీ విధానాన్ని ప్రారంభించాం. ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులకు ప్రీ-ప్రైమరీ విద్య అందిస్తున్నాం. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా నాణ్యమైన, పరిశుభ్రమైన బ్రేక్‌ఫాస్ట్, భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు పోషకాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం” అని వివరించారు.
పాలిటెక్నిక్‌లపై అపోహలు వద్దు
పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన జీఓ ఎంఎస్ నెం.97పై కొన్ని వివాదాలు తలెత్తాయని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తారనే ప్రచారాన్ని తోసిపుచ్చారు. “పాలిటెక్నిక్ కళాశాలల ప్రైవేటీకరణ అనే ప్రసక్తే లేదు” అని సభలో స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు ఇకపై కూడా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయి. కేవలం సాంకేతిక విద్యా వ్యవస్థను స్కిల్స్ యూనివర్సిటీ పరిధితో అనుసంధానం చేస్తున్నాం.
ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి టాటా సంస్థ సహకారంతో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. అంతమాత్రాన ఐటీఐలను ప్రైవేటు పరం చేసినట్లు కాదు. ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్కాలర్షిప్ అందించాలని నిర్ణయించాం” అని చెప్పారు.
పాలిటెక్నిక్‌ల విషయంలో భూములు అమ్ముకుంటారని, ఉద్యోగాలు పోతాయని కొందరు విద్యార్థుల్లో అపోహలు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ప్రభుత్వం అదనంగా 282 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏటీసీలకు బదలాయించిందని, ఒక్కో ఏటీసీపై సుమారు రూ.46 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా...
సాంకేతిక విద్యను పరిశ్రమల అవసరాలకు అనుసంధానించడమే పాలిటెక్నిక్‌లను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వెనుక ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి గారు వివరించారు. రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్ లను టాటా టెక్నాలజీ సంస్థ సహకారంతో రూ. 4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు.
విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశాలను పెంచడమే లక్ష్యమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు అనుగుణంగా టాటా టెక్నాలజీస్ సంస్థ సహకారంతో కోర్సులను ఆధునీకరిస్తామని చెప్పారు.
సాంకేతిక విద్య–నైపుణ్యాభివృద్ధి విభాగాల అనుసంధానంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతులు, ల్యాబ్‌లు, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. విద్యార్థుల్లో నెలకొన్న అపోహలను తొలగిస్తామని, జీఓలో సవరణలు అవసరమైతే వాటిని కూడా చేస్తామని హామీ ఇచ్చారు. స్కిల్స్ యూనివర్సిటీకి ఏఐసీటీఈ అనుమతి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
పేద విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని అన్నారు. వారి భవిష్యత్తును మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవాలని సభ్యులను కోరారు.
ఫీజు రీయింబర్స్మెంట్ లెక్కలు ఆశం పైనా ముఖ్యమంత్రి సభలో స్పష్టత ఇచ్చారు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.5,435 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వదిలివెళ్లిందని తెలిపారు. అందులో గత ప్రభుత్వం పెట్టిన బకాయిల నుంచి రూ.1,410 కోట్లు తమ ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందన్నారు.
అదేవిధంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రూ.1,465 కోట్లను చెల్లించామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం చెల్లించిన వాటితో కలిపి మొత్తంగా 32 నెలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.3,488 కోట్లు చెల్లించినట్లు సభలో వెల్లడించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు విద్యార్థుల ఖాతాల్లోకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ విధానం అమలు చేస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల కోసం అడ్వాన్స్‌గా గ్రీన్ చానెల్లో డబ్బు చెల్లిస్తున్నామని చెప్పారు. బకాయిల విషయంలో విజిలెన్స్ నివేదికను పరిశీలించిన తర్వాత నిజాయితీగా ఉన్న వాటన్నింటినీ బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు.
విద్యను కేవలం ఒక శాఖగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే సాధనంగా భావిస్తున్నామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి విద్య, నైపుణ్యం, ఉద్యోగం, ఉపాధిని అనుసంధానించేలా సంస్కరణలు చేపట్టామని తెలిపారు.

