Thursday, August 27, 2026
HomeEditorialతుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు

తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి నిరంతర ప్రయత్నాల నేపథ్యంలో ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.

 కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్‌ అధ్యక్షతన సేవా భవన్‌లో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. 

 తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి  మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి, రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించాలని కోరారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లగా, ప్రధానమంత్రి కార్యాలయం జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపించింది. అనంతరం ముఖ్యమంత్రి  ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్‌ పాటిల్‌ గారికి ప్రత్యేకంగా లేఖ రాసి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. 

 మహారాష్ట్ర గతంలో అంగీకరించిన 148 మీటర్ల ఎత్తుకు బదులుగా 152 మీటర్ల ఎత్తు ఉండేలా అంగీకారం సాధించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోంది. 148 మీటర్ల వద్ద అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని, భారీ పంపులు వినియోగిస్తే విద్యుత్‌ వ్యయం పెరుగుతుందని తెలంగాణ ఇప్పటికే కేంద్రానికి నివేదించింది. 

 తక్కువ విద్యుత్‌ వ్యయంతో, దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టును నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ ప్రధాన వాదన. సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనాల ప్రకారం జలమట్టం పెంచడం వల్ల అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వివరించింది.

వెనుకబడిన, కరవు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించే ఈ కీలక ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం, మహారాష్ట్రతో వరుసగా సంప్రదింపులు కొనసాగిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.