Friday, August 28, 2026
HomeEditorialముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం

📰 Generate e-Paper Clip

ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆందోళనకర పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో తీసుకోవలసిన చర్యలపై మంత్రిమండలి సుధీర్ఘంగా చర్చించింది.

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజాభవన్‌లో ఒక టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ హెల్ప్ లైన్ ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ 1-800-123-7157

తీవ్ర వర్షాభావ పరిస్థితులపై పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదించి నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక బృందాన్ని పంపించాలని కోరాలని భావించింది. అలాగే, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని మంత్రిమండలి కేంద్రాన్ని కోరుతూ తీర్మానించింది.

ఈరోజు వరకు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదని, 30 నుంచి 35 శాతానికి మించి వర్షపాతం నమోదు కాలేదని మంత్రిమండలి ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ పరిస్థితుల్లో అవసరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించింది. విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించింది.

తాగునీరు, విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతాంగానికి మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది.

వర్షాభావ పరిస్థితులపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రితో పాటు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఈ నెల 20న జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు అందరితో సమావేశాలు నిర్వహించి జిల్లాల వారిగా తలెత్తిన పరిస్థితులు, జరిగిన నష్టంపై సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని మంత్రిమండలి తీర్మానించింది.

రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి గారి సారథ్యంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక నివేదిక రూపొందించాలని మంత్రివర్గం సూచించింది.

ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన 36వ మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

భూముల రికార్డులు, భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు తెలిపారు.

ధరణి పోర్టల్ కు సంబంధించి టెండర్ ప్రక్రియ నుంచి మొదలు ఇటీవల వచ్చిన ఆరోపణల వరకు అన్ని అంశాలపై విచారణ జరిపించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

2020 అక్టోబర్ 29 నుంచి ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఈనాటి వరకు భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా జరిగిన అన్ని అనుమానాస్పద లావాదేవీలను లోతుగా పరిశీలించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019ను సవరించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

గ్రామ పంచాయతీ నిధుల నిర్వహణకు సంబంధించి జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఈ నిధులను జమ చేసుకునేలా ప్రతిపాదించిన సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో సవరణకు మంత్రిమండలి ఆమోదం ముద్ర వేసినట్టు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.