BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 8:15 am Posted by : Reporter Srikanth

మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాట్లు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా (CURE) పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, కాలుష్య నియంత్రణ వంటి ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుని కీలక ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానం అమలు చేయడానికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియ‌న్‌లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRTS) విధానంపై ఉన్నతాధికారులతో స‌మీక్ష నిర్వహించారు.

కేపిహెచ్‌బీ మెట్రోస్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ వరకు అత్యంత రద్దీగా ఉండే మార్గంలో పీఆర్‌టీ లైన్‌ను వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ ప్రాజెక్టు సంబంధించి డిసెంబర్ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఏడాది కాలంలో ఆ మార్గంలో పీఆర్‌టీ వ్యవస్థ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ మార్గంలో గచ్చిబౌలి ఐకియా సమీపంలో మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసి అందులో పీఆర్‌టీ డిపోను నిర్మించాలని చెప్పారు.

నగరంలో ఎల్‌బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా రాణిగంజ్ బస్టాండ్ వరకు మరో పీఆర్‌టీ లైన్ నిర్మించాలని సూచించారు.

అసెంబ్లీ మెట్రోస్టేషన్ నుంచి రవీంద్రభారతి, సచివాలయం, ఐమాక్స్ నుంచి బేగంపేట్‌ ను కలుపుతూ మరో పీఆర్‌టీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్‌ మార్గంలో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి అందులో పీఆర్‌టీ డిపోను నిర్మించాలని ఆదేశించారు.