BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 4:36 pm Posted by : Reporter Srikanth

భూమి కోసం ప్రాణాలైనా ఇస్తాం.. భూమి మీద ఉంటాం లేదా జైల్లో ఉంటాం!

బీపీసీఎల్ కంపెనీకి భూమి ఇచ్చే ప్రసక్తే లేదు!దండేపల్లి భూములను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం.డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ 

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి దండేపల్లి (ఎలుకతుర్తి): దండేపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 439లో దళిత, పేద కుటుంబాలకు గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములను బీపీసీఎల్ (BPCL) కంపెనీకి అప్పగించే ప్రసక్తే లేదని దళిత హక్కుల పోరాట సమితి (DHPS) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ స్పష్టం చేశారు. దండేపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 439లో పట్టాదారులు, సాగుదారులతో బుధవారం రోజున రాత్రి పాత దళిత వాడలో రేణిగుంట్ల సాంబయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన మారుపాక అనిల్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనే ప్రయత్నాలను సహించేది లేదన్నారు. ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాల జీవనాధారాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం అన్యాయమని విమర్శించారు.

భూమి అనేది పేదలకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది వారి జీవనాధారమని, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. పేదలకు పంపిణీ చేసిన భూములను పరిశ్రమల పేరుతో లాక్కోవడం సామాజిక న్యాయానికి విరుద్ధమన్నారు.

సర్వే నంబర్ 439లోని భూముల కేటాయింపు ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, భూములపై సమగ్ర విచారణ చేపట్టి అసలైన లబ్ధిదారుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే గ్రామ ప్రజలు, భూముల లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు.

ఉంటే భూమి మీద ఉంటాం.. లేదా జైల్లో ఉంటాం బీపీసీఎల్ కంపెనీకి భూమి ఇచ్చే ప్రసక్తే లేదు. పేదల భూముల పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడుతాం అని అన్నారు. ఈ సమావేశంలో కామెర లక్ష్మణ్, జూపాక రాజేశ్వరి, జన్ను సుమలత, సదిరం ఈశ్వర, కొలుగూరి సమ్మక్క లింగమూర్తి, జన్ను రాజయ్య తదితరులు పాల్గొన్నారు

మారుపాక అనిల్ కుమార్
డి.హెచ్.పి.ఎస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ