BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 4:18 pm Posted by : Reporter Srikanth

జమ్మికుంటలో నవంబర్ 15న ఉచిత మెగా వైద్య శిబిరం

మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆధ్వర్యంలో నిర్వహణ

భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట: పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు.

జమ్మికుంట పట్టణ పరిధిలోని బాలికల పాఠశాల ఆవరణలో అంజలి కిడ్నీ కేర్ సెంటర్, బాలసముద్రం, హనుమకొండ వారి సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 15వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగనుంది.

ఈ శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గీతాంజలి నరేష్ (యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, కిడ్నీ సర్జన్), డాక్టర్ నరేష్ సముద్రాల (ఫ్యామిలీ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్) పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించనున్నారు.

ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలు, మూత్ర సంబంధిత వ్యాధులు, మహిళలకు సంబంధించిన యూరో గైనకాలజీ సమస్యలు, మధుమేహం తదితర ఆరోగ్య సమస్యలపై వైద్యులచే తగిన సలహాలు, సూచనలు పొందేందుకు ఈ శిబిరం ఎంతగానో ఉపయోగపడనుంది.

పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కావున జమ్మికుంట పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కోరారు.