BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 10:46 pm Posted by : Reporter Srikanth

సుత్తితో తలపై బలంగా మోదీ యువకుడి హత్య

తోటి బైక్ మెకానిక్‌పై హత్య అనుమానం.. ఘనపూర్ శివారులో ఘటన

భీమ్ ఇండియా టుడే న్యూస్ సైదాపూర్ మండలం ఘనపూర్లో ఘటన చోటు చేసుకుంది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామానికి చెందిన పచ్చిమట్ల అజయ్ (20), తండ్రి రాజయ్య, హుజురాబాద్‌లో బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అదే ప్రాంతంలో తనతో పాటు బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న పత్తిపాక సాయికుమార్ (అమ్మనగుర్తి గ్రామం, సైదాపూర్ మండలం)తో కలిసి అజయ్ మద్యం సేవించినట్లు సమాచారం.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఘనపూర్ గ్రామ శివారులో సాయికుమార్ సుత్తితో అజయ్ తలపై బలంగా మోదినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడి, అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

మద్యం మత్తులో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనతో మెట్‌పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికి అందివచ్చిన 20 ఏళ్ల యువకుడు అర్ధాంతరంగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.