ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారు కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
సొంతింటి కల సాకారం కావడంతో కొత్త ఇంట్లో ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకున్న కందుకూరి జ్యోతి కుటుంబం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు కందుకూరి జ్యోతి నూతన గృహంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
చాలా సంవత్సరాలుగా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎదురుచూస్తున్న కందుకూరి జ్యోతి కుటుంబానికి ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో వారి ఆనందంలో మంత్రి భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి దంపతులకు నూతన వస్త్రాలు అందించి, స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
గత పదేళ్లుగా గృహ నిర్మాణానికి దూరమైన పేదలకు అండగా నిలిచేందుకు అర్హులను గుర్తించి విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు.
మొదటి విడతలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాలకు సమాన ప్రాతిపదికన 3,500 ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేశామని, రెండో విడతలో మరో 2,000 ఇళ్లు మంజూరు కానున్నాయని వెల్లడించారు. ఇందులో గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు 500, సగంలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసుకునేందుకు 500, కొత్తగా ఇళ్లు నిర్మించుకునేందుకు మరో 1,000 ఇళ్లను కేటాయించినట్లు వివరించారు.
సొంతిల్లు అనేది ప్రతి పేద కుటుంబం జీవితకాల స్వప్నమని, ఆ కలను సాకారం చేయడమే ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. గత పదేళ్ల విరామం కారణంగా గృహ నిర్మాణానికి భారీ డిమాండ్ ఏర్పడినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నూతన ఇందిరమ్మ ఇళ్లలో తొలిసారిగా పండుగ జరుపుకుంటున్న లబ్ధిదారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ రోజున జన్మదినం జరుపుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో పేదలు, బలహీన వర్గాలు, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
ఇందిరమ్మ ఇళ్లలో వెలిగిన దీపాల వెలుగులు పేద కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపుతున్నాయని, ఈ దీపావళి ఇందిరమ్మ ఇళ్లలో కొత్త వెలుగులు తీసుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు.