BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 9:47 am Posted by : Reporter Srikanth

ఉన్నత విద్యలో ఏఐ విప్లవానికి ‘నెక్స్ట్ 1.0’ వేదిక

గూగుల్ హైదరాబాద్ కార్యాలయంలో క్యాంప్‌ఎక్స్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక సదస్సు 

డిజిటల్ పరీక్షలు, బోధన, విద్యా పరిపాలనలో ఏఐ వినియోగంపై చర్చ 

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి: ప్రొ. బాలకిష్టారెడ్డి 

పలువురు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, విద్యారంగ ప్రముఖుల భాగస్వామ్యం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, నవంబర్ 5: ఉన్నత విద్యారంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవడంతోపాటు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను ఆధునీకరించే దిశగా ‘నెక్స్ట్ 1.0’ సదస్సు కీలక వేదికగా నిలిచింది. క్యాంప్‌ఎక్స్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గురువారం కొండాపూర్‌లోని గూగుల్ హైదరాబాద్ కార్యాలయంలో ఈ సదస్సు నిర్వహించారు. ‘నెక్స్ట్ జనరేషన్ అకడమిక్ ఎకోసిస్టమ్’ ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువురు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, విద్యావేత్తలు, ఉన్నత విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. క్యాంప్‌ఎక్స్ చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ మనసా కృష్ణ స్వాగతం పలికారు.

బోధన, పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం, విద్యా నాణ్యత ప్రమాణాలు, క్యాంపస్ నిర్వహణ వంటి విభిన్న రంగాల్లో ఏఐ వినియోగంపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. ‘న్యూ ఎడ్యుకేషన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్’ అనే పదాలకు సంక్షిప్త రూపమైన ‘నెక్స్ట్’ ద్వారా విద్యారంగంలో సరికొత్త సాంకేతిక పరిష్కారాలను పరిచయం చేయడంతోపాటు, వాటి ఆచరణాత్మక అమలుపై దృష్టి సారించారు.

ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ వి. బాలకిష్టారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాబోయే 20–30 సంవత్సరాలు భారతదేశానికి అత్యంత కీలకమని, ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజ అవసరాలకు అనుగుణంగా దేశంలోని విద్యా వ్యవస్థతోపాటు కోర్సుల్లోనూ సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 21వ శతాబ్దం జ్ఞాన విప్లవానికి నాంది పలుకుతోందని, సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞాన సంపద కలిగిన దేశాలే ప్రపంచాన్ని శాసిస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచం సాంకేతికత ఆధారంగా వేగంగా మారుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ప్రభుత్వాల విధానాలను సైతం సాంకేతిక పరిజ్ఞానం ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు పెరుగుతున్నప్పటికీ, విమానయాన నిర్వహణ కోర్సులను అందించే విద్యాసంస్థలు తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. పరిశ్రమల అవసరాలకు తగిన మానవ వనరులను సిద్ధం చేయకపోతే ఆయా రంగాలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కృత్రిమ మేధ, విమానయానం, రక్షణ రంగాలకు సంబంధించిన నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. జీఏటీఎస్ వంటి అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా ఉన్నత విద్యా ప్రమాణాలను మెరుగుపరచుకోవాలని చెప్పారు. చట్టం, రాజ్యాంగంపై అవగాహన లేకపోవడం క్షమించరాని విషయమని, ప్రతి ఒక్కరూ వాటిపై కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.

పరీక్షల నిర్వహణలో ఏఐతో సరికొత్త మార్పులు

క్యాంప్‌ఎక్స్ సీటీఓ యల్లాప్రగడ శ్రీకాంత్ ‘ఏఐ ఫార్వర్డ్ అకడమిక్స్’ అంశంపై కీలక ప్రసంగం చేశారు. ఏఐ సాయంతో జవాబు పత్రాలను డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయడం, మార్కుల కేటాయింపు, ట్యాబ్లెట్ ఆధారిత పరీక్షల నిర్వహణ, ఏఐ కంటెంట్ స్టూడియో, బోధన–అభ్యసన నిర్వహణ వ్యవస్థల పనితీరును వివరించారు. అధ్యాపకులపై పనిభారాన్ని తగ్గిస్తూ, బోధన, పరీక్షల ప్రక్రియలను మరింత సులభతరం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా తోడ్పడుతుందో వివరించారు.

క్యాంప్‌ఎక్స్ సీఈఓ యల్లాప్రగడ వెంకట్ మాట్లాడుతూ విద్యాసంస్థల డిజిటల్ అభివృద్ధిలో విద్యార్థులు, అధ్యాపకులు, పరిపాలనా విభాగాల అవసరాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల ప్రవేశాల నుంచి బోధన, పరీక్షలు, ఫలితాలు, వారి విద్యా ప్రగతి వరకు అన్ని ప్రక్రియలను ఒకే డిజిటల్ వ్యవస్థతో అనుసంధానిస్తే సమయం ఆదా కావడంతోపాటు సమాచార నిర్వహణ మరింత సమర్థంగా ఉంటుందని వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలను తీర్చిదిద్దడం, అధ్యాపకులకు నిరంతర సాంకేతిక శిక్షణ అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. 

చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కేతన్ శ్రీసాయి కొండబత్తుల

మాట్లాడుతూ… విద్యాసంస్థలు, సాంకేతిక సంస్థల మధ్య భాగస్వామ్యం బలోపేతమైతే దేశంలో ఆధునిక విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు.

విద్యారంగ ప్రముఖులతో కీలక చర్చలు

యల్లాప్రగడ వెంకట్ సమన్వయంతో నిర్వహించిన విద్యారంగ నాయకుల చర్చావేదికలో , జేఎన్‌టీయూ హైదరాబాద్ రెక్టార్ ప్రొఫెసర్ ఎ. దామోదరం, కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జి. పార్థసారథి వర్మ, అనురాగ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చన మంత్రి, గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ యు. చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఐఐఎల్‌ఎం విశ్వవిద్యాలయం–గురుగ్రామ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవికుమార్ జైన్, పంజాబ్‌లోని లామ్రిన్ టెక్ స్కిల్స్ విశ్వవిద్యాలయం సీఈఓ విమల్ మన్హోత్రా చర్చలో పాల్గొన్నారు. 

క్యాంప్‌ఎక్స్ ప్రొడక్ట్ హెడ్ డాక్టర్ బాల నాగేంద్ర ప్రసాద్ ‘నెక్స్ట్ జనరేషన్ అక్రెడిటేషన్ మేనేజ్‌మెంట్’ అంశంపై ప్రసంగించారు. విద్యాసంస్థలకు నాణ్యతా ప్రమాణాల గుర్తింపు ప్రక్రియలో అవసరమైన సమాచార నిర్వహణ, అంతర్గత నాణ్యత హామీ విభాగం (ఐక్యూఏసీ), జాతీయ విద్యా విధానం–2020 అమలులో సాంకేతికత పాత్రను వివరించారు. అన్ని విభాగాలకు ఒకే విశ్వసనీయ సమాచార వ్యవస్థను అందుబాటులో ఉంచడంతోపాటు, అధ్యాపకుల పర్యవేక్షణలో ఏఐ వినియోగం జరగాల్సిన ప్రాధాన్యతను వివరించారు.

గూగుల్ దక్షిణ ప్రాంత ఎడ్‌టెక్, విద్యా విభాగాల రీజినల్ హెడ్ సిద్ధార్థ్ దల్వాడి, ఏఐ సేల్స్ స్పెషలిస్ట్ సూర్య నిగమ్ ‘డీసీజీసీ 4.0 – గూగుల్ క్లౌడ్‌పై డిజిటల్ క్యాంపస్’ అంశంపై ప్రసంగించారు. క్లౌడ్ సాంకేతికత ఆధారంగా విద్యాసంస్థల డిజిటల్ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించే విధానాలను పరిచయం చేశారు. క్యాంప్‌ఎక్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కొండబత్తుల కేతన్ శ్రీసాయి ‘ఏఐ ఆధారిత సమగ్ర క్యాంపస్ నిర్వహణ’పై మాట్లాడుతూ వివిధ విభాగాల కార్యకలాపాలను ఒకే వ్యవస్థతో అనుసంధానించడం ద్వారా పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని వివరించారు. క్యాంప్‌ఎక్స్ భాగస్వామ్య సంస్థ విన్నిఫై సీఈఓ రవికిరణ్ పోతినేని తమ కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ వేదికను పరిచయం చేశారు.

ఓపెన్ ఫోరంలో విద్యాసంస్థల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు క్యాంప్‌ఎక్స్ నాయకత్వ బృందం సమాధానాలు ఇచ్చింది. అనంతరం ‘దేశానికి అవసరమైన విద్యా మౌలిక వసతుల నిర్మాణం’ అంశంపై యల్లాప్రగడ వెంకట్ ప్రత్యేక ప్రసంగం చేశారు.

ఉన్నత విద్యాసంస్థలకు పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం, విద్యా పరిపాలనకు సంబంధించిన సాంకేతిక సేవలను క్యాంప్‌ఎక్స్ అందిస్తోంది. గూగుల్ క్లౌడ్ రిజిస్టర్డ్ భాగస్వామిగా కొనసాగుతున్న ఈ సంస్థ, ఏఐ ఆధారంగా విద్యాసంస్థల కార్యకలాపాలన్నింటినీ సమన్వయం చేసే సమగ్ర డిజిటల్ క్యాంపస్ వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది.